ఆమె అడుగుపై.. అనుమానపు నీడ!
పార్వతీపురం రూరల్: ఇంటికి దీపం ఇల్లాలు అని కీర్తించే సమాజంలోనే.. ఆ దీపం ఆరని కన్నీటితో అడుగంటి పోతోంది. ఆకాశంలో సగం అని గొప్పలు చెప్పుకుంటున్నా.. అవనిపై ఆమెకు అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో గత రెండేళ్లుగా నమోదైన నేరాల చిట్టాను నిశితంగా పరిశీలిస్తే.. అంకెల గారడీలో తగ్గుదల కనిపిస్తున్నా, వాస్తవంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగానే మిగిలిపోయిందని స్పష్టమవుతోంది. నమ్మించి మోసం చేసే ‘వంచన’ కేసులు పెరగడం సభ్యసమాజాన్ని కలవరపెడుతోంది.
కట్న పిశాచి.. కాటేస్తూనే ఉంది!
వరకట్న నిషేధ చట్టం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. కాసుల కక్కుర్తి మాత్రం పోలేదు. గత ఏడాది 324 వరకట్న వేధింపులు కేసులు నమోదయ్యాయి. దాదాపుగా రోజుకో చోట ఓ మహిళ అత్తింటి వేధింపులకు బలవుతూనే ఉంది. ఇదే క్రమంలో పోలీస్ స్టేషన్ గడప తొక్కని, నాలుగు గోడల మధ్య నలిగిపోతున్న బాధితుల సంఖ్య వేలల్లో ఉంటుంది. జిల్లాలోనే ఒక్క ఏడాదిలో 200కు పైగా గృహ హింస కేసులు వెలుగు చూడటం, వన్ స్టాప్ సెంటర్లలో 270కి పైగా దాంపత్య తగాదాలు నడుస్తుండడమే ఇందుకు సాక్ష్యం.
ప్రేమ ముసుగులో.. ప్రాణాంతక క్రీడ
కొన్ని తరహా నేరాలూ తగ్గుముఖం పట్టినా.. అత్యాచారం, మోసం కేసులు పెరగడం ప్రమాదకర పరిణామంగా కనిపిస్తోంది. సాంకేతికత పెరిగాక సోషల్ మీడియా పరిచయాలు, ప్రేమ పేరుతో వల వేయడం, శారీరకంగా వాడుకుని ఆపై ముఖం చాటేయడం వంటి ఘటనలు ఎక్కువవుతున్నాయి. యువతను ఆకర్షించి, పక్కదోవ పట్టించే ముఠాల పట్ల పోలీసులు మరింత కఠినంగా ఉండాలన్న వాదన వినిపిస్తోంది.
కౌన్సెలింగ్ ఇస్తున్నా.. మళ్లీ అదే నరకంలోకి..
కుటుంబ తగాదాల విషయంలో పోలీసులు, వన్ స్టాప్ సెంటర్ల పాత్ర చాలా కీలకం. వివాదాలు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లలో, వన్ స్టాప్ కేంద్రాల్లోని కౌన్సిలర్లు ముందుగా భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం ప్రయత్నిస్తారు. ‘మీరిద్దరూ మళ్లీ చక్కగా కలిసి ఉండాలి, కుటుంబానికి విలువ ఇవ్వాలి’ అని వారికి హితబోధ చేసి, సయోధ్య కుదిర్చి పంపుతున్నారు. ఈ ప్రయత్నం వెనుక, కుటుంబ వ్యవస్థను నిలబెట్టాలనే సదుద్దేశం ఉంది. అయితే, ఈ కౌన్సెలింగ్ తర్వాత మళ్లీ అదే వేధింపుల వాతావరణంలోకి బాధితులను పంపించడం వల్ల.. సమస్య సమసిపోకుండా కేవలం వాయిదా పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు ఎంత మంచి మాటలు చెప్పినా, ఇంటి పోరు తగ్గడం లేదనే నిజాన్ని తెలుపుతున్నాయి.
అవసరం.. మరింత ‘కఠిన నిఘా’!
లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనల్లో దోషులకు వెంటనే శిక్ష పడేలా చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేయాలన్న వాదన వినిపిస్తోంది. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్, పెట్రోలింగ్ బృందాలు బహిరంగ ప్రదేశాల్లో నామమాత్రంగా కాకుండా కఠినమైన పర్యవేక్షణ చేపట్టాలి. మహిళా కళాశాలలు, హాస్టళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాలపై నిరంతరం దృష్టి సారించాలి. ప్రేమ పేరుతో మోసం చేసి, వంచనకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి. అపహరణ, బ్లాక్‌మెయిలింగ్ కేసుల్లో పకడ్బందీ విచారణ జరిపి, తక్షణ న్యాయం అందించగలిగితేనే.. ‘మృగాళ్ల’లో భయం పెరుగుతుందన్నది మహిళా సంఘాల అభిప్రాయం.
కుటుంబ కలహాలు వచ్చినప్పుడు పోలీసులు ‘చక్కగా కలిసి ఉండాలని’ హితబోధ చేసి పంపినా.. అదే వేధింపుల వాతావరణంలోకి పంపడం వల్ల న్యాయం వాయిదా పడుతోంది. అందుకే పోలీస్ శాఖ కఠిన నిఘాను, పర్యవేక్షణను పెంచాల్సిన అవసరం ఉంది. మందలింపులు కాదు.. వేధించినవారికి సరైన గుణపాఠం చెప్పాలి. దోషులకు త్వరితగతిన శిక్షలు పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను సమర్థంగా నిర్వహించినప్పుడే మృగాళ్లలో భయం పెరుగుతుంది. కఠిన చట్టాలను అమలు చేసే చిత్తశుద్ధి పెరిగినప్పుడే ‘ఆడబిడ్డ’కు రక్షణ లభిస్తుంది. న్యాయం కూడా జరుగుతుంది.
– రెడ్డి శ్రీదేవి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు,
పార్వతీపురం మన్యం
మగువకు ఇంటా బయటా అభద్రత..
జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న నేరాలు
తగ్గని వరకట్న వేధింపులు
కలవరపెడుతున్న ప్రేమ మోసాలు
గతేడాది ఉమ్మడి విజయనగరం జిల్లాలో వరకట్న వేధింపుల కేసులు: 324
లైంగిక వేధింపుల కేసులు: 137


