దళారుల భోజ్యం..!
రైతుల పేరిట..
● రైతుల పేరిట మిల్లులకు ధాన్యం తరలింపు
● కొనుగోలు కేంద్రాల సిబ్బందితో కుమ్మక్కు!
● రైతుల పేరుతో బిల్లులు
వీరఘట్టం: రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు.. దళారుల అక్రమ వ్యాపారానికి కేరాఫ్‌గా మారాయి. రైతుల నుంచి కొనుగోలుచేసిన ధాన్యంను దళారులు నేరుగా రైతుల పేరిట దర్జాగా మిల్లులకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. నేరుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే రైతుకు మద్దతు ధర లభిస్తుంది. దీనిపై అవగాహన లేని రైతులు కళ్లాంలోనే వ్యాపారులకు తక్కువ ధరకు ధాన్యం విక్రయిస్తున్నారు. వాటిని మిల్లులకు తరలించి రైతుల పేరిట దళారులు విక్రయిస్తున్నారు. రైతుల ఖాతాల నుంచి సొమ్మును తీసుకుని లాభసాటి వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో క్షేత్రస్థాయి సిబ్బంది కమీషన్లకు కక్కుర్తిపడి దళారులకు సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు నేరుగా మిల్లులకు ధాన్యం తరలిస్తే తేమశాతం పేరుతో కొర్రీలు పెడుతూ... దళారులకు పరోక్షంగా సహకరిస్తున్నారని కొందరు రైతులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటుచేసిన 180 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ దళారుల హవాయే సాగుతోందని, ఓ సిండికేట్‌గా మారి రైతు నుంచి అధిక ధాన్యం కాజేస్తున్నారని చెబుతున్నారు. ఉన్నతాధికారులు నిఘాపెడితే అసలు విషయం తెలుస్తుందని, రైతులకు మేలు జరుగుతుందన్న వాదన వినిపిస్తున్నారు.
రైతుకు దక్కని మద్దతు ధర
ఈ ఏడాది సాధారణ రకం ధాన్యం క్వింటా రూ.2,369లకు, గ్రేడ్–1 రకం ధాన్యం రూ.2,389కు కొనుగోలు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, క్షేత్రస్థాయిలో రైతులకు ఈ మద్దతు ధర అందడం లేదు. క్వింటా రూ.2000 నుంచి 2050లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. రైతుల వివరాలను కొనుగోలు కేంద్రాల్లో వ్యాపారులే నమోదు చేయిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే గరిష్ట మద్దతు ధరను వ్యాపారులు పొందుతున్నారు. రైతులతో చేసుకున్న ముందస్తు ఒప్పందం ప్రకారం రైతుల ఖాతాల్లో పడే డబ్బులను వారికి ఇవ్వాల్సింది ఇచ్చేసి మిగిలిన డబ్బులను వ్యాపారులే తీసుకుంటున్నారు.
ధాన్యం కొనుగోలులో రైతులను దగా చేయాలని చూసే దళారుల ఆగడాలకు కళ్లెంవేస్తాం. ధాన్యం కొనుగోలులో రైతులకు గరిష్ట మద్దతు వచ్చేలా నేరుగా కొనుగోలు కేంద్రాల సిబ్బందే రైతుల కళ్లాలకు వెళ్లి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం.
– యశ్వంత్‌కుమార్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్,
పార్వతీపురం మన్యం జిల్లా


