ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కలెక్టర్
మక్కువ: మండలంలోని ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలను శనివారం రాత్రి కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఆశ్రమ పాఠశాలలో తరగతి గదులు, వంటశాల, డార్మెటరీలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. మెనూ ప్రకారం భోజనాలు అందిస్తున్నారా? లేదా? అని ఆరా తీశారు. శతశాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. చదువుతోపాటు, క్రీడలపై మక్కువ చూపించాలన్నారు.
15న సర్పంచ్‌ల సమావేశం
గరుగుబిల్లి: పార్వతీపురం పట్టణంలోని రోయల్ కన్వెన్షన్ హాల్‌లో ఈ నెల 15న సర్పంచ్‌లతో కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఎంపీడీఓ జి.పైడితల్లి శనివారం తెలిపారు. పంచాయతీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సర్పంచ్‌లతో చర్చిస్తారన్నారు. కార్యక్రమానికి సర్పంచ్‌లంతా హాజరుకావాలని కోరారు.
ఉడకని అన్నం.. రుచిలేని కూర..?
● పోటీల నిర్వహణకు ఏర్పాట్లు లేమి
● ఉపాధ్యాయుల డివిజన్ స్థాయి
క్రీడాపోటీల నిర్వహణపై అసంతృప్తి
విజయనగరం: ఉపాధ్యాయుల క్రీడాపోటీల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్భాటం ఎక్కువ... సౌకర్యాలు తక్కువ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు పురుషుల విభాగంలో క్రికెట్, సీ్త్రల విభాగంలో త్రోబాల్ పోటీలు నిర్వహించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయి విజేతలకు విజయనగరం విజ్జి స్టేడియం వేదికగా శని, ఆదివారం డివిజిన్ స్థాయి పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. దీనికోసం రూ.20వేలు చొప్పున కేటాయించారు. విజయనగరం డివిజన్ పరిధిలోని 11 మండలాలకు చెందిన క్రీడా పోటీల నిర్వహణపై ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. నిర్దేశిత సమయానికి పోటీలు ప్రారంభించకపోవడం, కనీస సదుపాయాలు కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. క్రికెట్ పోటీల్లో కార్క్ బాల్‌ను వినియోగించగా... అందుకు అవసరమైన బ్యాట్‌లు, ప్యాడ్‌లు, హెల్మెట్, గార్డ్స్ వంటి పరికరాలు సమకూర్చలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభించాల్సిన పోటీలను 11 గంటల వరకు ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయకపోగా... మధ్యాహ్నం భోజనం కూడా ఉడకని అన్నం... సాంబారు, ఒక్క కూరతో వడ్డించడాన్ని ఆక్షేపించారు. మొదటి రోజు పోటీలను ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ప్రారంభించారు.
అంతర్జాతీయ వైజ్ఞానిక దృక్పథం అవసరం
విజయనగరం అర్బన్: ఇంజినీరింగ్ విద్య కోర్సుల్లో అంతర్జాతీయ దృక్పథం ఉండాలని, అప్పుడే డిగ్రీ పూర్తయిన తరువాత విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని జర్మనీ స్మోల్ట్‌సిక్ అండ్ పార్ట్‌నర్ ప్రాజెక్టు మేననేజర్ సురేష్ టంకాల అన్నారు. సీతం ఇంజినీరింగ్ కళాశాలలో ‘సిద్ధాంతం నుంచి వాస్తవంలో రూపంలోకి–ఇంజినీరింగ్ విద్యలో అంతర్జాతీయ దృక్పథాలు’ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. సిద్ధాంతాత్మక జ్ఞానాన్ని ప్రాయోజిత ఇంజినీరింగ్ పనులతో అనుసంధానం చేయాలన్నారు. కళాశాల డైరెక్టర్ మజ్జి శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డి.వి.రామమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్ వెంకటలక్ష్మి, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధితి జి.రవికిషోర్ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్‌కు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం.భార్గవి సమన్వయ కర్తగా వ్యవహరించారు.
ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కలెక్టర్
ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కలెక్టర్


