పోలమాంబ జాతరకు ఏర్పాట్లే ప్రధానం
● అమ్మవారి జాతర ఏర్పాట్లపై సమీక్ష
● అధికారులకు సూచనలిచ్చిన మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ ప్రభాకర రెడ్డి
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి పండగను కనులపండువగా జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ ప్రభాకరరెడ్డి అధికారులకు సూచించారు. అమ్మవారి చదురుగుడి వెనుకున్న క్యూల ప్రాంగణంలో జాతర ఏర్పాట్లపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతరలో చేపట్టబోయే ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. ముందుగా పార్వతీపురం, సాలూరు ఆర్టీసీ డిపో మేనేజర్లు జి.లక్ష్మణరావు, పి.చారీలు మాట్లాడుతూ గతేడాది జాతరలో సిరిమానోత్సవం రోజు 75 బస్సులు నడిపినట్టు తెలిపారు. వచ్చేఏడాది జనవరి 27న జరిగే సిరిమానోత్సవానికి ఉచితబస్సు సౌకర్యం ఉండడంతో మహిళలు అధికమంది వచ్చే అవకాశం ఉందని, 100 బస్సులు వరకు నడపాలని మంత్రి, కలెక్టర్ సూచించారు. తొలేళ్లు, అనుపోత్సవం నాడు కూడా భక్తులకు అవసరమైన మేరకు బస్సులు నడపాలన్నారు. మక్కువ నుంచి వయా బాగువలస మీదుగా సాలూరు పట్టణానికి వెళ్లే రోడ్డును ఈ నెల 28వ తేదీ నాటికి మరమ్మతులు పూర్తిచేయాలని ఆర్‌అండ్‌బీ జేఈ విజయకుమార్‌ను ఆదేశించారు. శంబర గ్రామానికి వచ్చే రోడ్లకు ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ చేయించాలని, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. జాతరకు 800 మంది పోలీసులతో బందోబస్తు విధులు నిర్వహించనున్నట్టు పోలీస్ అధికారులు రామకృష్ణ, ఎస్.వెంకటరమణ తెలిపారు. 140 మంది పారిశుద్ధ్య కార్మికులతో జాతరలో పారిశుద్ధ్యపనులు చేయనున్నామని డీఎల్‌పీఓ కొండలరావు తెలపగా, 250 మంది సిబ్బందిని కేటాయించాలని కలెక్టర్ ఆదేశించారు. సిరిమానోత్సవం రోజు సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూసివేసేలా పంచాయతీ తీర్మానం చేయాలన్నారు. సబ్ కలెక్టర్ అధ్యక్షతన మరో 15 రోజుల్లో సమావేశం నిర్వహిస్తారని, ఆయా శాఖల అధికారులు పక్కాగా ఏర్పాట్లపై సిద్ధంకావాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ మనీషారెడ్డి, జిల్లా దేవదాయశాఖాధికారి రాజారావు, జిల్లా విపత్తుల నివారణ అధికారి సింహాచలం, జిల్లా రవాణాశాఖాధికారి దుర్గాప్రసాద్ రెడ్డి, జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వినోద్‌కుమార్, సర్పంచ్ సింహాచలమమ్మ, ఎంపీటీసీ పోలినాయుడు, వైస్ సర్పంచ్ వెంకటరమణ, ఎంపీడీఓ అర్జునరావు, తహసీల్దార్ భరత్‌కుమార్, ట్రస్టుబోర్డు చైర్మన్ ఎన్.తిరుపతిరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పోలమాంబ జాతరకు ఏర్పాట్లే ప్రధానం


