కుష్టుపై కదం తొక్కాలి
● అపోహలు వీడితే చికిత్స సులభం
● 17 నుంచి ప్రత్యేక గుర్తింపు కార్యక్రమాలు
● కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి
పార్వతీపురం రూరల్: కుష్టువ్యాధి నిర్మూలనకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలని.. అపోహలను వీడి చికిత్స పొందేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుష్టుపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే సాధారణ అంటువ్యాధే తప్ప, కుష్టు భయంకరమైన వ్యాధి కాదన్నారు. ప్రారంభ దశలో గుర్తిస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత మందులతో పూర్తిగా నయం చేయవచ్చని స్పష్టం చేశారు. చర్మంపై స్పర్శ లేని లేత మచ్చలు, తిమ్మిర్లు, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ నెల 17 నుంచి జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా 15 నుంచి 26 ఏళ్ల యువత, విద్యార్థులే లక్ష్యంగా అవగాహన కల్పించాలన్నారు. వ్యాధిపై అపోహలు తొలగించేలా వైద్య సిబ్బంది వీడియోలు, రీల్స్ తయారు చేసి ప్రదర్శించాలని సూచించారు. విద్యార్థులకు పరిశుభ్రత, పౌష్టికాహారంపై అవగాహన పెంచాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కుష్టు వ్యాధి నిర్మూలనపై వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అలాగే స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో జిల్లా వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సమావేశంలో జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి ఎస్. భాస్కరరావు, డీఈఓ రాజ్‌కుమార్, పీడీ విజయగౌరి, మలేరియా నివారణ అధికారి టి.జగన్‌మోహన్, తదితరులు పాల్గొన్నారు.


