రోజువారీ లక్ష్యాలను పూర్తి చేయాలి
విజయనగరం అర్బన్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) పరిధిలో చేపడుతున్న పనులను రోజువారీ లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని, అలాగే ప్రతి కుటుంబానికీ 100 రోజుల పని కల్పించాలని కలెక్టర్ ఎస్. రామ్‌సుందర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వేతనదారుల పనిదినాలు, కనీస వేతనాలు, పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పనిదినాల కల్పనలో వెనుకబడితే సంబంధిత మండలాధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి మండలంలో కనీసం 1000 మంది ఉపాధి శ్రామికులకు తక్షణం పనులు కల్పించాలని ఆదేశించారు. జిల్లా సరాసరి వేతనాన్ని రూ.300గా నిర్దేశించినప్పటికీ అన్ని మండలాల్లో ఈ స్థాయి వేతనం అందడం లేదని.. వచ్చే వారానికి ప్రతి మండలంలో రూ.300 పైబడి వేతనం వచ్చేలా పనులు కల్పించాలన్నారు. వాతావరణం అనుకూలంగా ఉన్నందున ఎక్కువ మంది శ్రామికులు పనులకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో మంజూరైన ఫారంపాండ్స్, కంపోస్ట్ పిట్స్, రింగ్ ట్రెంచెస్, ఫిష్ పాండ్స్ వంటి పనులపై శ్రామికులకు అవగాహన కల్పించాలని సూచించారు. మంజూరైన పుశువుల శాలలన్నింటినీ వెంటనే గ్రౌండ్ చేయాలని ఆదేశించారు.
కలెక్టర్ రామ్‌సుందర్‌రెడ్డి


