
సమస్యల పరిష్కారంలో పారదర్శకత
● కలెక్టర్ ఎస్. రామసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: సమస్యల పరిష్కారంలో అధికారులు పారదర్శకత పాటించాలని కలెక్టర్ ఎస్. రామసుందర్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి జిల్లా అధికారులతో పాటు మండల, మున్సిపల్ స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లేదా జూమ్ లింక్ ద్వారా తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఫిర్యాదుల రీ ఓపెనింగ్ ఎక్కువగా ఉంటున్నాయని, రెండు వారాల్లో వాటిని తగ్గించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుదారుడికీ సక్రమమైన ఎండార్స్‌మెంట్ ఇవ్వడం, అందులో సంబంధిత రూల్ పొజిషన్ స్పష్టంగా పేర్కొనడం తప్పనిసరన్నారు. ఎండార్స్‌మెంట్లు నిర్లక్ష్యంగా ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిరోజూ కనీసం 60 కాల్స్ చేసి ఫిర్యాదుదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలన్నారు.
ఫిర్యాదుల స్వీకరణలో కొత్త విధానం..
పీజీఆర్‌ఎస్ వినతుల స్వీకరణలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఫిర్యాదులు అధికంగా వస్తున్న విద్యాశాఖ, డీఆర్‌డీఏ, వైద్యారోగ్య శాఖకు చెందిన బాధ్యతలను కలెక్టర్, జేసీ, డీఆర్‌ఓలతో పాటు ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లు తీసుకున్నారు. ప్రవేశ ద్వారంలోనే వినతులకు సంబంఽధించిన ప్రభుత్వ శాఖను తెలుసుకుని.. ఆ ఆధికారి వద్దకు నేరుగా అర్జీదారులను పంపే విధానాన్ని సోమవారం నుంచి అమలులోకి తెచ్చారు.
పీజీఆర్‌ఎస్‌కు 184 వినతులు..
పీజీఆర్‌ఎస్‌కు జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీదారుల నుంచి 184 ఫిర్యాదులు స్వీరించారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన వినతులు 69 వచ్చాయి. డీఆర్‌డీఏకి చెందినవి 28, డీపీఓకు సంబంధించినవి 13, మున్సిపాలిటీలకు సంబంధించి మరో 13, జీఎస్‌డీడబ్ల్యూస్‌కు 21, ఇతర శాఖలతో కలిపి 184 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు మురళీ, వెంకటేశ్వరరావు, నూకరాజు, ప్రమీలాగాంధీ, రాజేశ్వరి, కళావతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
40 ఫిర్యాదుల స్వీకరణ..
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు 40 వినతులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ఎస్పీ ఏఆర్ దామోదర్ శ్రద్ధగా విని, వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ తగాదాలకు సంబంధించి 8, కుటుంబ కలహాలవి 5, మోసాలవి 4, నగదు వ్యవహారాలకు సంబంధించినవి ఒకటి, ఇతర అంశాలకు సంబంధించినవి 22 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్‌బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారంలో పారదర్శకత