
టీడీపీలో వర్గపోరు..
జామి: టీడీపీలోని వర్గవిభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎన్నికల సమయంలో తమను వాడుకుని తీరా అధికారం వచ్చాక కరివేపాకులా తీసి పడేశారని జామి మండల అధ్యక్షుడు లగుడు రవికుమార్, తదితరులు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తీరుపై మండిపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో మండలంలోని అలమండలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు గొంప కృష్ణ ఎమ్మెల్యే టికెట్‌కు ప్రయత్నించగా.. ఆయనకు మద్దతు తెలిపామనే కక్షతో ఎమ్మెల్యే కోళ్ల తమను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా కోళ్ల లలితకుమారిని ప్రకటించినప్పుడు.. విశాఖ ఎంపీ భరత్, తదితర పెద్దలు కోళ్ల గెలుపుకోసం కృషి చేయాలని, కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీంతో తాము ఎంతో కష్టపడి పార్టీ గెలుపుకోసం పనిచేసినట్లు చెప్పారు. అనుకున్న ప్రకారం ఎన్నికల్లో కోళ్ల లలితకుమారి గెలిచిందని.. అయితే తమను మాత్రం పూర్తిగా పక్కనబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా మండలంలో వేరే వర్గాన్ని తయారు చేసి ప్రోత్సహిస్తున్నారన్నారు. పార్టీ కష్టకాలంలో జెండా మోసిన తమను కాదని.. వేరే వారిని ప్రోత్సహంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అలమండలో మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల ఏర్పాటుకు లలితకుమారి హామీ ఇచ్చి.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కలెక్టర్‌ను కలిసి కొన్ని పనులు మంజూరు చేయించుకుంటే ఎమ్మెల్యే వాటిని అడ్డుకున్నారని వాపోయారు. మండలంలో ఏ కార్యక్రమం జరిగినా తమకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. తన తండ్రి లగుడు సింహాద్రి జెడ్పీ చైర్మన్‌గా పనిచేసినా 2021లో జరిగిన మహానాడులో కనీసం అతని పేరు ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. పార్టీ అధిష్టానం దృష్టికి ఈ అంశాలన్నీ తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఇప్పాక వెంకట త్రివేణి, నాయుడుబాబు, బి.స్వామినాయుడు, బి.అప్పలనాయుడు, చిప్పాడ నాగరాజు, జాగరపు శ్రీను, రామకృష్ణ, డి.చినసత్యం, ఎర్ర శ్రీను, వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.
తమకు గుర్తింపు లేదన్న టీడీపీ మండల అధ్యక్షుడు రవికుమార్
పార్టీ నాయకులు, కార్యకర్తలతో
అలమండలో సమావేశం
ఎమ్మెల్యే కోళ్ల తీరుపై నిరసన
పార్టీ అధిష్టానం దృష్టికి సమస్యలు
మండల కమిటీ ఇదే..
సమావేశం అనంతరం పార్టీ మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎల్. రవికుమార్, ఉపాధ్యక్షుడిగా వేండ్రపు నాయుడుబాబు, జనరల్ సెక్రటరీగా బండారు పెదబాబు, ఆర్గ్‌నైజింగ్ సెక్రటరీలుగా శిరికి చంద్రరావు, గూనూరు సంతోష్‌కుమార్, రంభ అవతారం, జె.జ్యోతి, కార్యదర్శులుగా బి.స్వామినాయుడు, దాసరి చినసత్యం, ట్రెజరర్‌గా చిప్పాడ నాగరాజు ఎంపికయ్యారు.

టీడీపీలో వర్గపోరు..