
గణేష్ నిమజ్జనంలో అపశృతి
నెల్లిమర్ల రూరల్: మండలంలోని అలుగోలు గ్రామంలో గురువారం రాత్రి నిర్వహించిన గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ చెరువులో పడి కొంచాడ గణపతి (45) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై గణేష్, స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని నిమజ్జనోత్సవానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. విగ్రహాన్ని గ్రామ శివారులో ఉన్న గుండాల చెరువులో నిమజ్జనం చేసేందుకు యువకులంతా తీసుకెళ్తుండగా.. గ్రామానికి చెందిన కొంచాడ గణపతి తన ఫోన్‌ను చెరువు గట్టుపై ఉన్న నీలా కుమార్ అనే వ్యక్తికి ఇచ్చి చెరువులో దిగి కూరుకుపోయాడు. అయితే ఈ సంఘటనను ఎవ్వరూ గుర్తించలేకపోయారు. ఎంతకీ గణపతి రాకపోవడంతో ఇంటికి వెళ్లిపోయి ఉంటాడని భావించిన కుమార్ మొబైల్‌ను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెరువు వద్దకు చేరుకుని వెతకగా.. గణపతి మృతిదేహం కనిపించింది. మృతుడికి భార్య పావని, ఇద్దరు కుమార్తెలున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయ్యన్నపేటలో ఒకరు..
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అయ్యన్నపేటకు చెందిన రాజు (34) అనే యువకుడు చెరువులో పడి మృతి చెందాడు. సీఐ ఆర్‌వీకే చౌదరి తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడ్ని గురువారం రాత్రి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా సహచర స్నేహితులతో కలిసి రాజు నిమజ్జనోత్సవంలో పాల్గొన్నాడు. విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేసే క్రమంలో అందరితో పాటే చెరువులో దిగాడు. అయితే అందరూ పైకి వచ్చినా రాజు జాడ కనిపించలేదు. దీంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చి అందరూ వెతికారు. సమాచారం తెలుసుకున్న ఎన్టీఆర్, పోలీసులు శుక్రవారం ఉదయం గ్రామానికి చేరుకుని సుమారు 12 గంటలు గాలింపు చేపట్టగా రాజు మృతదేహం లభించింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చౌదరి తెలిపారు.
చెరువులో పడి వ్యక్తి మృతి

గణేష్ నిమజ్జనంలో అపశృతి