
ఈ చెరువు ఎవరి సొంతం..?
● తనదే అంటున్న గ్రామస్తుడు, కాదంటున్న ప్రజలు
● పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
● తహసీల్దార్ కార్యాలయంలో నేడు విచారణ
నెల్లిమర్ల రూరల్: మండలంలోని తంగుడుబిల్లి కాలనీ వద్ద ఉన్న ఓ చెరువు పొలిటికల్ హీట్‌ను పెంచుతోంది. నెల్లిమర్ల – రణస్థలం ప్రధాన రహదారి పక్కన సర్వే నంబర్–72లో 2.40 ఎకరాల స్థలం పూర్వం నుంచి ఓ చెరువును పోలి ఉండేది. మూడేళ్ల కిందట వరకు ఆ చెరువు ఖాళీగానే ఉండేది. అప్పట్లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చెరువు తనదేనంటూ చదును చేయడానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అప్పటి తహసీల్దార్ రాము సైతం చెరువుపై ఎవరికీ యాజమాన్య హక్కు లేదని ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇటీవల గ్రామస్తులు ఇంటికి కొంత నగదు సేకరిచి చెరువును బాగు చేసుకున్నారు. దీంతో మళ్లీ సదరు వ్యక్తి ఆ స్థలం తనదని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అనంతరం గ్రామస్తులు చెరువు ఆక్రమణ అడ్డుకోవాలని పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి కూడా తనదే ఆ స్థలం అంటూ అధికారులను ఆశ్రయించాడు. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఆ స్థలం జిరాయితీ భూమిగా ఉందని ప్రస్తుత తహసీల్దార్ శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయం కాస్తా పీజీఆర్‌ఎస్‌కు చేరడంతో చెరువు అంశం ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకుంది. సదరు వ్యక్తి తరఫున కొంత మంది టీడీపీ అగ్రనాయకులు రంగ ప్రవేశం చేసి కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ తగాదాపై అధికారులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం పంచాయితీ ఏర్పాటు చేశారు. ఈ విషయమై ఇరువర్గాలకు సమాచారం అందించామని తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు. ఈ చెరువు ఎవరి సొంతమో పంచాయితీలో తేలిపోనుంది.