మంత్రిగా తొలి సంతకం.. అమలుకు ఎన్నాళ్లు ఆగాలో! | - | Sakshi
Sakshi News home page

మంత్రిగా తొలి సంతకం.. అమలుకు ఎన్నాళ్లు ఆగాలో!

Jul 26 2025 8:52 AM | Updated on Jul 26 2025 9:52 AM

మంత్ర

మంత్రిగా తొలి సంతకం.. అమలుకు ఎన్నాళ్లు ఆగాలో!

● ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంల నియామకం ఎప్పుడు? ● విద్యార్థులు తరచూ అనారోగ్యం బారిన.. ● సూది మందు ఇచ్చే దిక్కు కూడా కరువే

గిరిజన మంత్రి ఇచ్చిన మాట

నిలబెట్టుకోవాలి..

ఏటా గిరిజన విద్యార్థుల మరణాలు జరుగుతున్నా ప్రభుత్వానికి.. మంత్రులు, ఎమ్మెల్యేలకు పట్టకపోవ డం విచారకరం. గిరిజన సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన డబ్బులతో అడ్డగోలు, అవస రం లేని భవనాలు, వాటికి రంగులు, మరమ్మతులు ఎందుకు? ఐటీడీఏ నిధులతో ఏఎన్‌ఎంల నియామకం చేసి గిరిజన విద్యార్థుల ప్రాణా లు కాపాడవచ్చు. తక్షణమే గిరిజన శాఖ మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.

– పాలక రంజిత్‌ కుమార్‌, గిరిజన సంక్షేమ

సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి

సాక్షి, పార్వతీపురం మన్యం:

జిల్లాలో అధిక శాతం ఆదివాసీ బిడ్డలే. తల్లిదండ్రులకు దూరంగా వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఉంటూ చదువుకుంటున్నారు. వీరికి ఇక్కడ సౌకర్యాలు మాట ఎలా ఉన్నా.. కనీసం జ్వరం వస్తే నాడి పట్టి చూసే వైద్య సిబ్బంది అందుబాటులో ఉండరు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. సమయానికి వైద్య సేవలు పొందక ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు కోకొల్లలు. గత విద్యా సంవత్సరంలోనే జిల్లాలో సుమారు 8 మందికి పైగా విద్యార్థులు జ్వరాలు ఇతర అనారోగ్య సమస్యలతో మృత్యువాత పడ్డారు. ప్రధానంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఆరోగ్య కార్యకర్తలు లేకపోవడంతో విద్యార్థులకు స్థానికంగా వెనువెంటనే వైద్యం అందడం లేదు. దీంతో జ్వరం వచ్చినా.. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలి. లేకుంటే అనారోగ్యంతోనే కాలం గడపాలి. ఈలోగా పరిస్థితి విషమించడం, మరింత మందికి సమస్య వ్యాపింపజేయడం చోటు చేసుకుంటోంది.

విద్యార్థులు మృతి చెందుతున్నా...

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 55 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. గత నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవ్వగా.. వివిధ గిరిజన ప్రాంతాల నుంచి విద్యార్థులను తల్లిదండ్రులు వసతి గృహానికి తీసుకొచ్చిన కొద్ది రోజులకే జ్వరాల బారిన పడ్డారు. కొద్ది రోజుల కిందట కొమరాడ మండలంలోని పెదఖేర్జల గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు మలేరియాతో బాధపడినా సరైన వైద్య సేవలు అందలేదు. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఇద్దరు గిరిజన బాలికలు మృతి చెందారని, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని గిరిజన సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఇంత నిర్లక్ష్యం తగదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

పర్యవేక్షణ పటిష్టంగా

ఉంటేనే ఫలితం..

సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, పోస్టుమెట్రిక్‌ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఐటీడీఏ పీవో యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి ఇటీవల ప్రత్యేక చర్యలు చేపట్టారు. విద్యార్థులు ఎలాంటి అనారోగ్య సమస్యకు గురైనా ఆ విషయాన్ని ఐటీడీఏకు వెంటనే తెలియజేసేలా 14 మంది ఉద్యోగులకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 47 ఆశ్రమ పాఠశాలలు, 12 గురుకులాలు, 18 పోస్టుమెట్రిక్‌ వసతి గృహాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఐదేసి విద్యా సంస్థల చొప్పున కేటాయించి ఏ రోజు వివరాలు ఆ రోజునే తీసుకుని, ఐటీడీఏకు తెలియజేసేలా కార్యాచరణ రూపొందించారు. ఇది మూడు రోజుల ముచ్చటగా కాకుండా, పకడ్బందీగా అమలు చేస్తేనే ఫలితాలు ఉంటాయని ప్రజాసంఘాల నాయకులు అంటున్నారు.

మొదటి సంతకం అమలు ఇప్పట్లో లేనట్లేనా?

మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి

గతంలో ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిగా పని చేశాం. తర్వాత మమ్మల్ని తొలగించారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్ష ణకు చిత్తశుద్ధితో పనిచేశాం. మమ్మల్ని విధుల్లో కి తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆ మేరకు మాకు న్యాయం చేయాలి.

– గౌరీశ్వరి, పార్వతీపురం మన్యం జిల్లా

గిరిజన శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన గుమ్మిడి సంధ్యారాణి బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటి సంతకం ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంల నియామకంపైనే చేశారు. ఒక తల్లిగా, మహిళగా, గిరిజన బిడ్డగా.. అది తన బాధ్యతని చెప్పుకొచ్చారు. అధికారం చేపట్టి 13 నెలలు గడిచినా నేటికీ ఆ సంతకం అమలకు నోచుకోలేదు. ఈ విద్యా సంవత్సరంలో కూడా అమలవుతుందన్న నమ్మకం లేదు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఏఎన్‌ఎంలు వారానికి రెండుసార్లు ఆశ్రమ పాఠశాలకు వెళ్లాలని ఇటీవల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తొలి సంతకం హామీ అటకెక్కినట్లే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇచ్చిన మాట, పెట్టిన మొదటి సంతకం మేరకు తక్షణమే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో, వసతి గృహల్లో గతంలో పనిచేసిన ఆదివాసీ ఆరోగ్య(ఏఎన్‌ఎం)

సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని కొద్దిరోజులుగా గిరిజన సంఘాలు కలెక్టరేట్‌ వద్ద నిరసన దీక్షలు చేపడుతున్నాయి. అయినప్పటికీ అధికార యంత్రాంగంలో చలనం రాలేదు.

మంత్రిగా తొలి సంతకం.. అమలుకు ఎన్నాళ్లు ఆగాలో! 1
1/2

మంత్రిగా తొలి సంతకం.. అమలుకు ఎన్నాళ్లు ఆగాలో!

మంత్రిగా తొలి సంతకం.. అమలుకు ఎన్నాళ్లు ఆగాలో! 2
2/2

మంత్రిగా తొలి సంతకం.. అమలుకు ఎన్నాళ్లు ఆగాలో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement