
గిరిజన రైతుల ఆక్రందన
సాగుమార్గంలేక...
మక్కువ:
వ్యవసాయమే వారికి జీవనాధారం. ఉన్నపాటి కాస్త విస్తీర్ణంలో పంటలు సాగుచేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు వారి పొలాలకు వెళ్లే మార్గాన్ని అటవీశాఖ అధికారులు బంద్ చేశారు. ట్రాక్టర్లు వెళ్లకుండా కందకాలు తవ్వించారు. మొక్కలు నాటారు. అంతే... పూర్వం నుంచి తమ వ్యవసాయ భూములకు రాకపోకలు సాగించే మార్గం మూసుకుపోయింది. భూమిని దుక్కి, దమ్ముచేసేందుకు ట్రాక్టర్లు వేళ్లేందుకు అవకాశం లేదు. వ్యవసాయ ఉత్పత్తులను తరలించేమార్గం లేక ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించే ‘మార్గం’ చూపాలంటూ మక్కువ మండలంలోని బాగుజోల, ఆలగురువు, మెండంగి గ్రామాలకు చెందిన 30 మంది రైతులు వేడుకుంటున్నారు. దారి చూపకపోతే 40 ఎకరాల్లో కొండపోడు, జిరాయతీ భూముల్లో పంటలు సాగు చేసేందుకు అవకాశం ఉండదంటూ గగ్గోలు పెడుతున్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా..
రిజర్వ్ ఫారెస్ట్ మధ్యగుండా పూర్వం నుంచి తిరుగాడుతున్న దారిని మాకు ఇప్పిస్తే చాలంటూ ఈ నెల 21న కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్‌కు విజ్ఞప్తిచేశారు. తమ సమస్యను తెలియజేశారు. మక్కువ తహసీల్దార్‌కు కూడా ఈ నెల 22న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నాలుగురోజులు అవుతున్నా సమస్య పరిష్కరించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురుస్తున్నాయని, వరి ఉభాల కోసం పొలాలను దమ్ము చేసేందుకు ట్రాక్టర్ వెళ్లేలా మార్గం చూపాలని వేడుకుంటున్నారు. ఇదే విషయపై ఫారెస్ట్ రేంజర్ కె.తవిటినాయుడు మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకం కాదని, పంటలు సాగుచేసుకునేందుకు ఇబ్బంది పెట్టమన్నారు. ఇటీవల వేసిన మొక్కలు పాడవుతున్నందున, దారిలో ట్రెంచ్‌కట్ చేశామన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి గిరిజన రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
‘దారి’ చూపాలి
నా పేరు పాలక సెత్రు. మాది ఆలగురువు గ్రామం. నేను రెండకరాల్లో పంటలు పండించుకుంటున్నాను. గతంలో పొలానికి వెళ్లేందుకు దారి ఉండేది. ఈ ఏడాది పొలం దమ్ము జరిపించేందుకు ట్రాక్టర్ వెళ్లే దారిలేకుండా అటవీశాఖాధికారులు మొక్కలు నాటారు. ఉభాలు ఏ విధంగా జరిపించాలో అర్ధం కావడం లేదు. అధికారులు స్పందించి పొలానికి వెళ్లేందుకు దారి చూపాలి.

గిరిజన రైతుల ఆక్రందన