
వచ్చేశాయ్..!
సీతాఫలాలు
మన్యంలో గిరిజన ఉత్పత్తుల్లో ముఖ్యమైన ఫలాలు ఒకదాని తరువాత ఒకటి మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తున్నాయి. నిన్నటి వరకు పైనాపిల్ దిగుబడులు వచ్చి ముంచెత్తగా... తాజాగా మధుర ఫలాలుగా చెప్పుకునే సీతాఫలాలు మార్కెట్‌లోకి వచ్చాయి. ఈ ఏడాది దిగుబడులు బాగానే ఉన్నా.. ధరలు ఎలా ఉంటాయోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడులకు సరిపడేటట్టు ధరలు కూడా బాగుంటే తమ వ్యవసాయ పెట్టుబడులకు ఇవి చేదోడుగా ఉంటాయని గిరిజన రైతులు పేర్కొంటున్నారు. ఇక వీటి ధరలు దళారీలపైనే ఆధారపడి ఉంటాయని మరోవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మన్యంలో
● రెండు వేల ఎకరాల్లో సాగు
● కావిడ ధర రూ.800ల పైనే..
● మైదాన ప్రాంతాల్లో డిమాండ్
సీతంపేట: మధుర ఫలాలుగా పిలవబడే సీతాఫలాల సీజన్ సీతంపేట మన్యంలో ఆరంభమైంది. ఈ ఏడాది దిగుబడులు కూడా అధికంగా ఉంటాయని గిరిజనులు ఆశతో ఉన్నారు.ఽ అదే సమయంలో మద్దతు ధరలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. ఆదివారం సీతంపేట మార్కెట్లోకి సీతాఫలాలు గిరిజన రైతులు తీసుకువచ్చారు. కావిడ సీతాఫలాలు రూ.800ల నుంచి రూ.1000ల వరకు విక్రయించారు. గతేడాది సీజన్ ఆరంభంలో ఇవే ధరలకు అమ్మకాలు జరిపామని గిరిజనులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రారంభమైన సీజన్ అక్టోబరు మొదటి వారంతో ముగుస్తుంది. గిరిజనులకు పైనాపిల్ తర్వాత అత్యధిక ఆదాయాన్ని తెచ్చే పంట సీతాఫలాలు. ఈ ఏడాది పైనాపిల్ పండ్లతో నష్టాలు చవిచూసిన మన్యంలోని గిరిజనులు సీతాఫలంలోనైనా ఆదాయాలు వస్తాయేమోనని ఆశతో ఉన్నారు. ఒడిశా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడ సీతాఫలాలను కావిళ్ల రూపంలో కొనుగోలు చేస్తారు. ఆయా ప్రాంతాల్లో వారు కిలోల వంతున విక్రయించి లాభాలను ఆర్జిస్తారు. ఇక్కడ కిలో సరాసరి రూ.20 వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు మైదాన ప్రాంతాల్లో రూ.60 నుంచి 80 వరకు విక్రయిస్తారు. కొంత మంది సీజన్ ఆరంభంలోనే గ్రామాల్లోకి వెళ్లి అడ్వాన్సులు ఇచ్చి కొనుగోలు చేస్తారు.
2 వేల ఎకరాల్లో సాగు
సీతంపేట ఏజెన్సీలో కొండపోడు వ్యవసాయంలో భాగంగా దాదాపు 2 వేల ఎకరాల్లో సీతాఫలం పంట సాగవుతుంది. సుమారు 500ల టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఖరీఫ్ సీజన్లో వరిలో పెట్టుబడులు పెట్టడానికి ఈ పంట ఎంతో దోహద పడుతుందని గిరిజనులు చెబుతున్నారు. గతేడాది మొదట్లో ఇదే ధరలు ఉన్నప్పటకీ మధ్యలో ధరలు తగ్గిపోయాయి. గిరిజనులు నిల్వ చేసుకోవడానికి వీలుకాని పండ్ల జాతిలో సీతాఫలం ఒకటి. చెట్టు నుంచి రెండు, మూడు రోజుల్లో విక్రయించకపోతే పండు కుళ్లిపోతుంది. ఆది, సోమవారాల్లో సీతంపేట, బుధవారం మర్రిపాడు, శనివారం పొల్ల, కుశిమి, గురువారం దోనుబాయిలలో జరిగే వారపు సంతల్లో వీటిని విక్రయిస్తారు. దళారుల తీరుపైనే వీటి ధర ఆధారపడి ఉంటుందని గిరిజనులు వాపోతున్నారు. దళారులు సిండికేట్‌గా మారితే తమకు నష్టాలు తప్పవని లేకుంటే ఆశించిన ఆదాయం సమకూరుతుందని పేర్కొంటున్నారు.
దిగుబడి ఉన్నా ధరలు ఏవి..?
సీతాఫలాల దిగుబడి ఉన్నా ధరలు ఎంత వరకు నిలబడతాయో తెలీదు. గతంలో సీతాఫలం పండించే కుటుంబాల్లో ఒక్కొక్కరు రూ.10 వేల వరకు ఆదాయం సంపాదించే వారు. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదు. వ్యవసాయ పెట్టుబడులకు డబ్బులు లేని పరిస్థితి ఉంది. వీటి ద్వారా మంచిగా ఆదాయం సమకూరితే పెట్టుబడులకు ఇబ్బందులు ఉండవు. – ఎస్.సురేష్, బుడగరాయి
ఏటా నష్టాలు..
సీతాఫలాల దిగుబడులు బాగున్నా.. ధర లేక ప్రతీ ఏటా నష్టాలు తప్పడం లేదు. సీజన్ ఆరంభంలో ఽసరైన ధరలు పలుకుతాయి. మధ్యలో ధరలు పడిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ పరంగా మద్దతు ధరలు కల్పిస్తే బాగుంటుంది.
– ఎస్.లక్ష్మి, అక్కన్నగూడ

వచ్చేశాయ్..!

వచ్చేశాయ్..!

వచ్చేశాయ్..!