
మీ కోసం వెబ్‌సైట్‌లో అర్జీల నమోదు
● కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం రూరల్: మీ కోసం వెబ్‌సైట్ (మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్)లోనూ సమస్యలపై ప్రజలు అర్జీలు నమోదు చేయవచ్చునని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల సమస్యలు ప్రతీ సోమవారం స్వీకరించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ రోజు ప్రజల వినతులు స్వీకరించడానికి సెల్లార్‌లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ర్‌ీఫీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చునని ఆయన తెలిపారు.
నేడు పీజీఆర్‌ఎస్
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ప్రాజెక్టు అధికారి సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించనున్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను అందించవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.
జ్వరంతో బాలింత మృతి
సీతంపేట: మండలంలోని పొల్ల పంచాయతీ చీడిమానుగూడకు చెందిన ఆరిక ప్రియాంక(21) అనే గిరిజన బాలింత ఆదివారం జ్వరంతో విశాఖపట్నం కేజీహెచ్‌లో మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. నెల రోజుల కిందట మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఈ నెల 15న కన్నవారి ఇంటికి మొగదారగూడకు వచ్చింది. 17న జ్వరం రావడంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో తండ్రి రాజన్న చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ నుంచి విశాఖపట్నం కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రియాంకకు రెండేళ్ల క్రితం వివాహమైంది. నెల రోజుల కిందట మగ బిడ్డ పుట్టి తల్లి ఇప్పుడు చనిపోవడంతో భర్త సుందరరావు కన్నీరుమున్నీరై రోదిస్తున్నారు. బాలింత మృతితో గ్రామంలో విషాదం అలుముకొంది.
చదువుపై దృష్టి సారించాలి
● సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అన్నపూర్ణ
గంట్యాడ: విద్యార్థులు చదువుపై దృష్టి సారించి మంచిగా ఎదగాలని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అన్నపూర్ణ అన్నారు. మండలంలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహంలో విద్యార్థులకు ఆదివారం క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రమాణాల స్థాయిని మరింత మెరుగుపరిచేందుకు ఇకపై ప్రతి నెల మూడో ఆదివారం క్విజ్ పోటీలను నిర్వహించేందుకు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. చదువుతో పాటు ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. క్విజ్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వసతి గృహ వా ర్డెన్ గొర్లె గోవింద సన్యాసిరావు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ మెమో 57ను తక్షణం అమలు చేయాలి
బొబ్బిలి: ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మెమో 57ను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కౌన్సిలర్ జేసీ రాజు డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం మెమో 57ను విడుదల చేసి ఏళ్లు గడుస్తున్నా దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. తద్వారా 2003కు ముందు ఉద్యోగ నియామకం పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. 2023 జూలై నుంచి ఉద్యోగులకు 12వ వేతన సవరణ జరగాల్సి ఉండగా రెండేళ్లు గడుస్తున్నా నేటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకపోవ డం ఆందోళనకు గురి చేస్తోందని పేర్కొన్నారు.

మీ కోసం వెబ్‌సైట్‌లో అర్జీల నమోదు