
ప్రోటోకాల్ ఉల్లంఘన సరికాదు
సీతంపేట: క్షేత్రస్థాయిలో పథకాల అమలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు పలు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు తెలియజేయకుండా అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇది సరైన పద్ధతి కాదని అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ మేరకు సోమవారం సీతంపేట ఐటీడీఏలో జరిగిన గ్రీవెన్స్‌సెల్‌లో ఆమె పాల్గొన్నారు. పలు అంశాలపై ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఇతర అధికారులతో మాట్లాడారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు రాజ్యాంగబద్ధంగా ప్రజలచేత ఎన్నికై న వారని, వారిని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. వారికి తగిన గౌరవం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇదే అంశమై మరోసారి ఫిర్యాదు వస్తే ఏ స్థాయి వరకు తీసుకువెళ్తే ఈ సమస్య పరిష్కారమవుతుందో అక్కడి వరకు తీసుకువెళ్లడానికి వెనుకాడబోనన్నారు. గిరిజన ప్రాంతాల్లో అధికారులు పనిచేయడం ఒక అదృష్టంగా భావించాలని హితవు పలికారు.
పాలకవర్గ సమావేశం ఎందుకు నిర్వహించలేదు?
ఐటీడీఏలో ఇంతవరకు పాలకవర్గ సమావేశం జరగకపోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు. ఈ అంశం పరిశీలనలో ఉందని పీఓ సమాధానమిచ్చారు. బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్‌లో అదనపు సీట్లు పెంచాలని సూచించారు. కొండచీపుళ్లు, ఇతర అటవీఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని పరిష్కరించాలని సూచించారు. ఏఏ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం అవసరమో సర్వే చేయిస్తానని ఈ సందర్భంగా పీఓ ఆమెకు తెలిపారు.
ప్రారంభం కాని రహదారుల పనులు
రహదారులకు గత ప్రభుత్వ హయాంలో రూ.13 కోట్ల నిధులు మంజూరు కాగా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదని, హౌసింగ్ సమస్యలు పరిష్కరించాలని, గ్రామాల్లో టీటీడీ ద్వారా నిర్మాణాలు జరిగే గుడులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. ఇంకా మరికొన్ని సమస్యలపై ఆమె చర్చించారు. కార్యక్రమంలో ఎంపీపీ బి.ఆదినారాయణ, జెడ్పీ కోఆప్షన్ సభ్యురాలు ఎస్.లక్ష్మి, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు
అరకు ఎంపీ తనూజారాణి
గ్రీవెన్స్‌లో పలు అంశాలపై ఐటీడీఏ పీఓ, అధికారులతో చర్చ