
గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం విచారకరం
విజయనగరం టౌన్: కేంద్ర కేబినెట్, రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపి ఆరేళ్లు అయినా ఇంతవరకు విశాఖ కేంద్రంగా సౌత్‌కోస్ట్ రైల్వే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం విచారకరమని సౌత్‌కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ చోడవరపు శంకరరావు ఓ ప్రకటనలో అన్నారు. నోటిఫికేషన్ విడుదలైతే రైల్వేజోన్ తన కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉంటుందని, ఇప్పటికీ రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదన్నారు. దీంతో విజయవాడ, గుంతకల్, గుంటూరు డివిజన్‌లపై పర్యవేక్షించే అధికారం లేకపోయిందన్నారు. ప్రధాని మోదీ చొరవ తీసుకుని, రైల్వేజోన్‌కు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఉత్తర్వులు వెలువడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కనీసం ఆగస్టు 15 నాటికి అయినా కొత్త సౌత్‌కోస్ట్ రైల్వే జోన్ తన పరిపాలన ప్రారంభించేలా స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.