
చోరీకేసులో నిందితుల అరెస్ట్
గజపతినగరం రూరల్: ఈనెల1వ తేదీన రైల్వేకాలనీలోని పాండ్రంకి గణేష్ ఇంట్లో జరిగిన చోరీకేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు గజపతినగరం సీఐ రమణ తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం రైల్వేస్టేషన్ ఏరియాలో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు తిరుగుతున్నారని వచ్చిన సమాచారం మేరకు వారిని పట్టుకుని విచారణ చేయగా కాలనీలో జరిగిన దొంగతనం తామే చేశామని ఒప్పుకున్నారని తెలిపారు. అలాగే అదేరోజు సాలూరులో కూడా ఓ ఇంటిలో దొంగతనం చేశామని అంగీకరించినట్లు చెప్పారు. దీంతో వారి నుంచి 200 గ్రాముల వెండి, రూ.1150 నగదు రికవరీ చేశామన్నారు. చోరీకి పాల్పడిన వారిలో గుంటూరు జిల్లాకు చెందిన చిల్లా సురేష్‌పై ఇప్పటికే 50కేసులు నమోదయ్యాయన్నారు. అలాగే విజయవాడకు చెందిన నాగవీరభాస్కరరావు, జల్లేపల్లి వెంకటేశ్వరరావు, దాసరి సుభాష్‌లపై కూడా కేసులు ఉన్నాయని, వారు నలుగురు ఒక కారులో మక్కువలోని శంబర గ్రామం వెళ్లారన్నారు. ఆ తరువాత అదే రోజు ఈ రెండు దొంగతనాలు చేసి గుంటూరు వెళ్లిపోయినట్లు చెప్పారు. ఈ కేసును ఛేదించిన ఎస్సై కిరణ్‌కుమార్‌తో పాటు సిబ్బందికి ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేసినట్లు సీఐ తెలిపారు.