
తేలని ఈఈల పంచాయితీ!
సీతంపేట: ఐటీడీఏలో అన్ని శాఖల్లో కీలకమైనది ఇంజినీరింగ్ విభాగం. రోడ్లు, భవన నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనలో ఆ శాఖ అధికారులు పాత్ర కీలకం. కూటమి ప్రభుత్వ తప్పిదాలతో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ శాఖలో ఈఈ పోస్టు విషయంలో గందరగోళం నెలకొంది. మునుపెన్నడూ లేని విధంగా ఒక ఈఈ పోస్టుకోసం ఇద్దరు ఈఈల మధ్య కుర్చీలాట సాగుతోంది. ఇక్కడ ఎన్నిమిది నెలలుగా ఈఈగా పనిచేస్తున్న రమాదేవిని గత నెల 9న నెల్లూరుకు బదిలీ చేశారు. ఆ స్థానంలో కేవీఎన్‌ఎస్ కుమార్‌ను నియమించారు. ఆయన గత నెల 11న బాధ్యతలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తనను బదిలీ చేశారంటూ రమాదేవి కోర్టును ఆశ్రయించారు. ఆమె బదిలీ ఉత్తర్వులను కోర్టు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆ మేరకు తను తిరిగి ఈఈగా గత నెల 18న సీట్లో కూర్చున్నారు. ఈ పంచాయితీ గత నెల 26న ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్ది వద్దకు వెళ్లింది. రమాదేవిని ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీని కలవాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు కుమార్ ఈఈగా కొనసాగుతారని అప్పట్లో తెలియజేశారు. దీంతో పరిపాలనా విధులన్నీ ఈఈ కుమార్ నిర్వహిస్తున్నారు.
మళ్లీ మొదటి కొచ్చిన కథ..
తానే ఈఈని అంటూ మల్లీ రమాదేవి ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ కుర్చీలో యథావిధిగా వారం రోజుల తర్వాత వచ్చి శుక్రవారం కూర్చున్నారు. గిరిజన సంక్షేమశాఖ ప్రన్సిపల్ సెక్రటరీని కలిశానని, కోర్టు ఉత్వర్వుల మేరకు ఈఈగా బాధ్యతలు కొనసాగిస్తానని తెలిపారు. ఈ విషయమై ఈఈ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం తనను ఇక్కడకు బదిలీ చేయడంతో విధులు నిర్వహిస్తున్నాని తెలిపారు. డీడీఓ అధికారాలు కూడా ఉండడంతో ప్రశాంతంగా ఉద్యోగం చేస్తున్నానన్నారు. ఫైనల్ ఆర్డర్ ప్రభుత్వం నుంచి ఎలా వస్తే అలా చేస్తామన్నారు. కాగా కిందిస్థాయిలో ఉద్యోగులు, జేఈ, ఏఈలు మాత్రం ఎవరిని కలవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

తేలని ఈఈల పంచాయితీ!