ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయుల వినూత్న నిరసన
పార్వతీపురం: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించడం సరికాదని జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు ఆఫ్‌లైన్‌లోనే బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిల్చొని శనివారం నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో సెకెండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపడతామని హామీ ఇచ్చి దానికి భిన్నంగా ప్రస్తుత విద్యా శాఖ డైరెక్టర్, విజయనగరం, శ్రీకాకుళం, కడప తదితర జిల్లాల్లో వెబ్ కౌన్సెలింగ్‌కు ఉపాధ్యాయులను సంసిద్ధత చేయడం శోచనీయమన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాలు ఆయా జిల్లా కేంద్రాల్లో సమావేశమై వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారన్నారు. బదిలీల ప్రక్రియను పునఃసమీక్షించి వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేసి ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు ఆఫ్‌లైన్ ప్రక్రియ ద్వారా కౌన్సెలింగ్ చేసి బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్‌కు డిమాండ్


