అక్కడ చేయి తడిపితేనే పని..!
నెల్లిమర్ల: నగర పంచాయతీ సిబ్బంది ప్రతి పనికీ లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైసలు ఇవ్వనిదే నగన పంచాయతీలో పనులు జరగడం లేదు. ఇంటి పన్నులు వేయడం, ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్ మంజూరు చేయడం, జనన, మరణ ధ్రువపత్రాల జారీ చేయడం కోసం పట్టణవాసుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. ఇదీ గత ఐదు దఫాలుగా జరిగిన కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు. అయినా సరే సిబ్బందిలో ఏమాత్రం మార్పు రాలేదని పట్టణవాసులు వాపోతున్నారు. ఏ పనికై నా మున్సిపల్ కార్యాలయం మెట్లు ఎక్కాలంటేనే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిని కంట్రోల్ చేయడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగర పంచాయతీ కార్యాలయంలో ఏ పని జరగాలన్నా సంబంధిత సిబ్బంది చేతులు తడపాల్సిందేననే ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కావాలంటే అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ డబ్బులు గుంజుతున్నారని పట్టణవాసులు ప్రత్యక్షంగా చెబుతున్నారు. అవసరం లేకపోయినా అఫిడవిట్ కావాలంటూ వేలాది రూపాయలు డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు. పాత సర్టిఫికెట్లు కావాలంటే కనీసం రూ.10వేలు అయినా ఇవ్వాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా నిర్మించుకునే ఇళ్లకు ప్లాన్ అప్రూవల్ కావాలంటే కనీసం రూ.50 వేలు అయినా సమర్పించుకోవాల్సిందే. తాజాగా మొయిద జంక్షన్‌లో నిర్మిస్తున్న ఓ భవనానికి అనుమతి కోసం ఏకంగా రూ.80 వేలు అదనంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. టౌన్ ప్లానింగ్ అధికారులు కాకుండా ఇతర విభాగానికి చెందిన కొంతమంది సిబ్బంది ఇలాంటి వ్యవహారాలు నడుపుతున్నట్లు సమాచారం.
ప్రతి సర్టిఫికెట్‌కు సమర్పించాలి
ఇక సర్టిఫికెట్ల విషయానికి వస్తే ప్రతి సర్టిఫికెట్‌కు పైసలు ఇవ్వాల్సిందేనని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. జనన, మరణ ధవీకరణ పత్రాలు కావాలంటే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు సమర్పించాలని వాపోతున్నారు. అన్నీ సక్రమంగా ఉన్నా అఫిడవిట్ పేరుతో కనీసం రూ.వెయ్యి అయినా ఇస్తే గాని సర్టిఫికెట్ ఇవ్వని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇదే విషయమై గత ఐదు దఫాలుగా జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో పలువురు కౌన్సిలర్లు చైర్‌పర్సన్, కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది సిబ్బంది పేర్లు కూడా సదరు సమావేశాల్లో ప్రస్తావించారు. అయినా సంబంధిత అధికారులు సిబ్బందిని నియంత్రించడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికై నా అధికారులు స్పందించి, సిబ్బంది వసూళ్లకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు, కౌన్సిలర్లు కోరుతున్నారు.
వసూళ్లకు పాల్పడుతున్న నగర
పంచాయతీ సిబ్బంది
ఇంటి పన్ను, ప్లాన్ అప్రూవల్,
ధ్రువపత్రాల కోసం నగర ప్రజల పాట్లు
కౌన్సిల్ సమావేశంలో పలుమార్లు సభ్యుల ఫిర్యాద


