కోనేరంతా కన్నీరు
పుష్కరిణిలో జారిపడి ఇద్దరు పిల్లలు మృతి
గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు
ఆమదాలవలసలో విషాద ఛాయలు
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీరా మలింగేశ్వరస్వామి పుష్కరిణిలో ఆదివారం సా యంత్రం ఇద్దరు చిన్నారులు జారి పడి మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. పట్టణంలోని గణేష్‌నగర్‌కు చెందిన సురవరపు నాగరాజు కుమారుడు పవన్(8), గణేష్ నగర్‌కు చెందిన శంకు సుదర్శన్ కుమారుడు శంకు ధనుష్(6)వి ఎదురెదురు ఇళ్లు. ఆదివారం సెలవు కావడంతో సైకిల్ తొక్కుకుంటూ పుష్కరిణి వద్దకు వెళ్లి ఆడుకుంటున్నారు. ఆ కోనేరు గట్టు జారుగా ఉండడంతో జారి కోనేరులో పడిపోయారని స్థానికులు చెబుతున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో వారిని రక్షించలేకపోయారు. కాసేపటి తర్వాత అక్కడున్న వేరే పిల్లలు చెప్పడంతో కొంతమంది యువకులు పుష్కరిణిలోకి దిగి గాలించారు. తొలుత పవన్‌ను గుర్తించారు. అలాగే మరికొంత సేపు గాలించగా ఊబిలో కూరుకుపోయి ఉన్న ధనుష్‌ను పైకి తీశారు. ఈ లోగా వారి తల్లిదండ్రులు కూడా అక్కడకు చేరుకున్నారు. 108కి సమాచారం అందించడంతో వారు వచ్చి చూసి పిల్లలు చనిపోయారనే విషాద వార్త తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై విలపించారు. మృతుల్లో పవన్ స్థానిక లక్ష్మినగర్ ము న్సిపల్ స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్నాడు. తండ్రి నాగరాజు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. తల్లి పార్వతి గృహిణి. మరో మృతుడు శంకు ధనుష్ పట్టణంలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. తండ్రి సుదర్శన్ పట్టణంలో కోటి కాంప్లెక్స్ సమీపంలో టిఫిన్ కొట్టు నడుపుతుంటారు. ఆదివారం తమ కళ్ల ముందు ఆడుకున్న పిల్లలు అంతలోనే చనిపోయారని తెలియడంతో స్థానికులు నిశ్చేష్టులైపోయారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టు మార్టంకు తరలించారు.
ఇదే కోనేరులో గతంలోనూ ఇలాంటి దుర్ఘటనలు జరిగాయి. జనావాసాల మధ్యన ఉన్న ఈ పుష్కరిణి చుట్టూ సీసీ రోడ్డులు, మెట్లు నిర్మించారు గానీ రక్షణ గోడ ఏర్పాటు చేయలేదు. ఈ అలసత్వమే ఇప్పుడు పిల్లల పాలిట మరణ శాసనాలు రాస్తోంది. చెరువులో కూడా ఊబి ఎక్కువగా ఉండడంతో కనీసం ఆ చెరువు క్లీనింగ్‌కు కూడా నోచుకోవడం లేదు. దీంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టణ వాసులంటున్నారు.
పవన్
మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి


