ధాన్యం కొనుగోలులోనూ టీడీపీ హవా..!
విజయనగరం ఫోర్ట్: రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా టీడీపీ నేతలు వదల్లేదు. కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే వారు కూడా తమ పార్టీవారినే టీడీపీ నేతలు నియమించుకున్నారు. టీడీపీకి చెందిన వారు అయితే తమ పార్టీనేతల కనుసన్నల్లో నడుస్తున్నారని పసుపు పార్టీ సానుభూతిపరులనే జిల్లాలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నియమించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే అనుభవాన్ని కానీ, అర్హతను కానీ పట్టించుకోకుండా నియమకాలు చేపట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టారు. కానీ చంద్రబాబు సర్కార్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టినట్లు గుసుగుసలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ శాఖల్లో కానీ, సంస్థల్లో గాని పనిచేసే ఉద్యోగాలు తాత్కాలికమే అయినప్పటికీ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయడం అనవాయితీ. కానీ చంద్రబాబు సర్కార్ హయంలో పసుపు పార్టీయే అర్హతగా పోస్టులను భర్తీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత, అనుభవం లేక పోయినా పసుపు పార్టీకి చెందిన మద్దతు దారులు అయితే వారికి అప్పనంగా పోస్టులు కట్టబెట్టేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్స్, పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, వాచ్‌మెన్, వెలుగు వీఓఏలు, కేజీబీవీల్లో పనిచేసే కుక్, వాచ్‌మెన్‌లను తొలిగించి టీడీపీకి చెందిన వారిని నియమించుకున్నారు. తాజాగా ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందిని కూడా టీడీపీ వారినే నియమించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు:
జిల్లాలో 382 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించారు. ఒక హెల్పర్, ఒక టెక్నికల్ అసిస్టెంట్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. రెండు, మూడు నెలల పాటు వీరు విధులు నిర్వహించనున్నారు. హెల్పర్‌కు రూ.9 వేలు, టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.12వేలు చొప్పన వేతనాలు అందించనున్నారు. రైతు కళ్లం నుంచి ధాన్యం శాంపిల్ సేకరించి తేమశాతం పరీక్షించడం టెక్నికల్ అసిస్టెంట్ చేయాల్సిన విధులు. అయితే ఎక్కడా క్షేత్ర స్థాయికి వెళ్లి శాంపిల్ సేకరణ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రక్ షీట్స్ జనరేట్ చేస్తారు. హె ల్పర్ వారికి సహాయంగా ఉంటారు.
టీడీపీ సానుభూతిపరులే కొనుగోలు సిబ్బంది
జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలు
ఒక్కో కేంద్రంలో ముగ్గురు చొప్పున నియామకాలు
రెండు, మూడు నెలల పాటు విధులు
సిబ్బంది నియామకం పీఏసీఎస్‌లదే
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే సిబ్బందిని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘా(పీఏసీఎస్)లు నియమించుకుంటాయి. సిబ్బంది నియామకం బాధ్యతే వారిదే.
బి.శాంతి, జిల్లా మేనేజర్, సివిల్ సప్లైస్


