
కిడ్నాపైన వివాహిత హత్య
శృంగవరపుకోట: మండలంలోని వెంకటరమణ పేట గ్రామానికి చెందిన వివాహిత కిడ్నాప్‌కు గురికావడం..ఆపై ఆమె మృతదేహం బావిలో లభ్యం కావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎర్రాప్రగడ వెంకటక్ష్మి (38) శనివారం రాత్రి 10 గంటల సమయంలో కుమారై రిషితతో కలిసి బహిర్భూమికి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత రిషిత ఇంటికి వచ్చి ఎవరో గుర్తుతెలియని కొందరు వచ్చి అమ్మను ఆటోఎక్కించి తీసుకెళ్లిపోయారని, తనను పక్కకు తోసేశారని తండ్రి సత్యనారాయణ, అన్నయ్య హరీష్‌కు చెప్పగా వారు పరిసర గ్రామాలకు బైక్‌లతో వెళ్లి వెతికినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే పోలీసులకు హరీష్ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కిడ్నాప్ అయిన వివాహిత ఆచూకీ కోసం సీఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. ఆదివారం ఉదయం డాగ్‌స్క్వాడ్‌తో ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా గ్రామసమీపంలోని బావిలో మహిళ మృతదేహం ఉన్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. వెలికితీసిన మృతదేహాన్ని వెంకటలక్ష్మిగా గుర్తించడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించి వివరాలు సేకరించారు.
బావిలో లభ్యమైన మృతదేహం
ఉలిక్కిపడిన గ్రామస్తులు

కిడ్నాపైన వివాహిత హత్య