
డెంగీ పట్ల అప్రమత్తం
ఆందోళన అవసరం లేదు
దోమల వృద్ధిని అరికట్టడం ద్వారా డెంగీ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. డెంగీ వ్యాధి పట్ల ఆందోళన అవసరం లేదు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ద్రవపదార్థాలు, పళ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి.
డాక్టర్ ఎస్.జీవన రాణి, డీఎంహెచ్‌ఓ
● జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి బారిన పడకుండా ఉండే అవకాశం
● 2024లో 203 కేసుల నమోదు
● ఈఏడాదిలో 23 కేసుల నమోదు
● నేడు డెంగీ నివారణ దినం
విజయనగరం ఫోర్ట్: డెంగీ వ్యాధి పట్ల ఏమాత్రం అలసత్వం వహించినా మృత్యువాత పడే ప్రమాదం ఉంది. తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. శుక్రవారం జాతీయ డెంగీ నివారణ దినం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. గత ఏడాది రెండు వందలకు పైగా డెంగీ కేసులు జిల్లాలో నమోదయ్యాయి. సకాలంలో చికిత్స చేయించుకుంటే కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.
డెంగీ లక్షణాలు
వైరల్ జ్వరం మాదిరి వచ్చి ఆకస్మాత్తుగా తీవ్రంగా పరిణమిస్తుంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్లనొప్పులతో పాటు ఎముకలు విరిగేటంత నొప్పి కలిగిస్తుంది. ఒక్కోసారి శరీర అంతర్భాగాల్లో రక్తస్రావం జరగడం వల్ల కాళ్లు, చేతులు, ముఖం, వీపు ఉదర భాగాల చర్మంపై ఎర్రగా కందినట్లు చిన్నచిన్న మొటిమలు కనిపిస్తాయి. ఒక్కో సారి ప్లేట్‌లెట్స్ తగ్గిపోయి రోగి పరిస్థితి విషమంగా ఉంటుంది. ఈడిస్ ఈజిప్టు అనే దోమకాటు వల్ల డెంగీ వ్యాప్తి చెందుతుంది. దోమ పగటి పూట కుడుతుంది. దోమ కుట్టినప్పుడు ఒళ్లుంతా దద్దుర్లు కనిపిస్తాయి. ఇళ్లలోని కుండీలు, గోలాలు, ఓవర్‌హెడ్ ట్యాంకుల్లోను, ఎయిర్ కూలర్లు, ఇళ్ల పరిసరాల్లో నిర్లక్ష్యంగా పడేసిన కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ కప్పులు, పగిలిన సీసాలు, టైర్లు వంటి వాటిల్లో చేరిన దోమలు వర్షపు నీటిలో గుడ్లు పెట్టడంతో ఈడిస్ దోమ పెరుగుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటి పరిసర ప్రాంతాల్లో వృథా నీటిని నిల్వ ఉంచరాదు. పెంటకుప్పులు, ఇంట్లో వచ్చే చెత్తాచెదారం ఇంటికి దూరంగా వేయాలి. ఇళ్లలో ఉన్న అన్ని గదుల్లో దోమల మందు చల్లించాలి. దోమతెరలు వాడడం లేదా ఇంటి కిటీకీల తలుపులకు జాలీలు ఏర్పాటు చేసుకోవాలి. నీరు నిల్వ చేసే పాత్రలను ప్రతి వారానికి ఒక సారి ఖాళీ చేసి మళ్లీ నింపుకోవాలి. తాగి వదిలేసిన కొబ్బరి బొండాలు, పాతటైర్లు, ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు, పూలకుండీల్లో నీటిని తరచూ మార్చాలి.
నీళ్ల ట్యాంకులపై సరైన మూతలను అమర్చాలి. క్రమంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. దోమ కాటునుంచి రక్షణకోసం శరీరం అంతా కప్పి ఉంచుకునే విధంగా దుస్తులు వేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలను బట్టలు లేకుండా బయట తిరగనీయరాదు. కుళాయి దగ్గర నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలో గల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలి.

డెంగీ పట్ల అప్రమత్తం

డెంగీ పట్ల అప్రమత్తం