
పోలీస్ కస్టడీలో గంజాయి డాన్..!
రామభద్రపురం: గంజాయి అక్రమరవాణా చేస్తున్న వ్యక్తులపై సీఐ కె నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావు ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ డాన్‌గా పేరున్న వ్యక్తి, కొట్టక్కి పోలీస్ చెక్ పోస్టు వద్ద కారులో అక్రమంగా గంజాయి తరలింపునకు కారకుడైన ప్రధాన నిందితుడు రామభద్రపురం పోలీసుల కస్టడీలో ఉన్నట్లు తెలిసింది. ఈ నిందితుడు గంజాయి అక్రమరవాణాలో పట్టుబడడంతో రామభద్రపురంతో పాటు ఎస్‌కోట, సాలూరు, కొత్తవలస, పాచిపెంట తదితర పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదైనట్లు సమాచారం ఉంది.అయితే విశాఖ సెట్రల్ జైల్‌లో ఉన్న ప్రధాన నిందితుడిని హుకుంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడి నుంచి పీపీ వారెంట్‌పై రామభద్రపురం పోలీస్ కస్టడీకి తీసుకొచ్చి పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రథమ నిందితుడు అనంతగిరి చెందిన వ్యక్తిగా తెలిసింది. కొట్టక్కి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టులో ఫిబ్రవరి 10 వతేదీ రాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో వాహనాలు చెక్ చేస్తున్నారు. ఇంతలో వాహనాల వెనుకన ఒడిశా నుంచి అక్రమంగా ఒడిశా నుంచి 150 కిలోల గంజాయిని తరలిస్తున్న డస్టర్ కారు డ్రైవర్ కారును జాతీయ రహదారి పక్కన చిన్న రూట్‌లో తప్పించి స్పీడ్‌గా లాగించేశాడు. దీంతో అప్రమత్తమైన ఏఎస్సై అప్పారావు, పోలీస్ సిబ్బంది వెంటాడారు. సరిగ్గా కొట్టక్కి దుర్గమ్మ గుడి వద్దకు వెళ్లేసరికి సరిగా దారి కనిపించకపోవడంతో కారు వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. ఈ నేపథ్యంలో కారును, అందులో ఉన్న 150 కిలోల గంజాయి(74 ప్యాకెట్లు)ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులు ఉన్నట్లు విచారణలో తేలగా ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు.
వివరాలు సేకరిస్తున్న పోలీసులు