
సీతం కళాశాలలో ‘ఇ–గేమ్’ పుస్తకావిష్కరణ
విజయనగరం అర్బన్: సీతం కళాశాలలో ‘ఈ–గేమ్ (ఎ డిఫరెంట్ అప్రోచ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ ఫన్) అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన పౌరులు, వీరమరణం పొందిన సైనికులకు తొలుత ఘనంగా నివాళులర్పించి వారి ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎంపీ, సత్య సంస్థల కరస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ ఇ–గేమ్ (ఇంగ్లీష్ గ్రామర్ ఆక్సిస్ మేడ్ ఈజీ) పుస్తకం ద్వారా విద్యార్థులు సులభంగా, తర్కబద్ధంగా, సరదాగా ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోగలుగుతారన్నారు. ఇందులో స్వప్టిప్స్ అనే 7 ప్రధాన అంశాల (వాక్యాలు, క్రియలు, ఆర్టికల్స్, స్పీచ్ భాగాలు, కాలాలు, ప్రశ్నార్థకాలు–ఆదేశాలు, పొజిషన్ మార్కులు)తో పాటు అడ్వాన్స్‌డ్ గ్రామర్, ప్రశ్నా బ్యాంకులు, రిడిల్స్, పాల్ప్‌స్ వంటి వర్డ్ గేమ్‌లు, ఎక్సలునీమ్, వెర్సనీమ్, ఫ్యాక్టనీమ్, స్లింగ్, ఐథెర్, స్పెల్ స్ప్రెడ్స్ వంటి వినూత్న అంశాలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ భాష అనివార్యమని, ఈ పుస్తకం ద్వారా అలవోకగా నేర్చుకోవచ్చని తెలిపారు.
మేన్ ఆఫ్ విజ్‌డం
సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జీఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ ఈ పుస్తకం విద్యార్థులలో ఇంగ్లీష్ భాషాపరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో పోటీతత్వం కలిగించగలదన్నారు. రచయిత ఆర్‌యూ నరసింహాన్ని ‘మేన్ ఆఫ్ విజ్‌డం’ అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ–జీవీ రిజిస్ట్రార్ డాక్టర్ జయసుమ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రచయిత ఆర్‌యూ నరసింహం పుస్తక విశేషాలను వివరించి, గ్రామర్ నేర్చే పద్ధతిని సరదాగా మార్చేందుకు ఈ పుస్తకం సహాయపడుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్. మజి శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి, విశాఖ సాంస్కృతిక పత్రిక ఎడిటర్–పబ్లిషర్ శ్రీ సిరెలా సన్యాసిరావు, ఇతర కళాశాలల ఇంగ్లీష్ అధ్యాపకులు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.