
ప్రతి వారం పురోగతి కనిపించాలి
ఆదర్శ గ్రామంగా ‘మనుమకొండ’
పార్వతీపురంటౌన్: భామిని మండలం మనుమకొండ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో సోమవారం వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వివిధ రంగాల్లో యంత్రాల వినియోగం పెంపుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి రంగంలో కనీసం 15 శాతం సుస్థిర అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక, మత్స్య శాఖలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు, వంట గ్యాస్, గృహం, ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు, తాగు నీరు, విద్యుత్, మరుగుదొడ్లు ఉండాలని, వాటి విని యోగం పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామంలో ఫోన్ సేవలు, బ్రాడ్‌బ్యాండ్ సేవలు, విద్యా సంస్థ, వైద్య సేవలు అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు. పసుపు, చింతపండు, అడ్డాకులు తదితర ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్తుల్లో ఆర్థిక అక్షరాస్యత పెంచాలన్నారు. కార్యక్రమంలో సీతంపేట ఐటీడీఏ పీఓ, పాలకొండ సబ్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా ప్రణాళిక అధికారి పి.వీరరాజు, బ్లాక్ కోఆర్డినేటర్ మహేశ్వరరావు పాల్గొన్నారు.
పార్వతీపురంటౌన్: కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లాలో చేపట్టే క్యాస్కెడింగ్, చెక్ డ్యామ్‌లు, కోకోనట్ ప్లాంటేషన్ పనుల్లో ప్రతివారం పురోగతి కనిపించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నీటి పారుదలశాఖ ఈఈలు, డీఈఈలు, ఏఈఈలతో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. చెరువులు, చెక్‌డ్యామ్‌ల పనులను పంచాయతీ సర్పంచ్‌ల తీర్మానంతో వెంటనే ప్రారంభించాలన్నారు. ఏఈఈల వారీగా లక్ష్యాలు నిర్దేశించాలన్నారు. ఇకపై ప్రతి సోమవారం వీటిపై సమీక్షిస్తామన్నారు. ఇచ్చిన లక్ష్యాలు నాలుగు వారాల్లో పూర్తిచేసిన అధికారులకు ప్రత్యేక ప్రోత్సాహక బహుమతిని అందజేస్తామని తెలిపారు. ఎకరాకు 60 కొబ్బరి మొక్కల చొప్పున 5వేల ఎకరాల్లో కొబ్బరి తోటల పెంపకానికి ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ ఆర్.అప్పల నాయుడు, ఇతర ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.