
గ్రంథాలయాలు... విజ్ఞాన సోపానాలు
ఎన్నో నేర్చుకుంటున్నాం..
వేమన, సుమతి, తెలుగుబాల పద్యాలు నేర్పుతున్నారు. ఎన్నో అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. కథలు చెబుతున్నారు. ఆటలు ఆడిస్తున్నారు. చాలా బాగుంది.
– బి.పవిత్ర, విద్యార్థిని
పఠనాసక్తి పెరుగుతుంది
ప్రస్తుత తరానికి పుస్తక పఠనం అలవాటు తగ్గిపోతోంది. అధునాతన సాంకేతిక విప్లవంలో భాగంగా సెల్‌ఫోన్‌లు, వాట్సాప్, ఫేస్‌బుక్ అందుబాటులోకి రావడంతో పిల్లలు వాటికి ప్రభావితమవుతున్నారు. దీంతో వారిలోని సహజమైన విజ్ఞానం పెంపొందించుకొనే గుణం తగ్గిపోతుంది. వారికి పుస్తకపఠనాన్ని అలవాటుగా మార్చుతున్నాం. విజ్ఞానం పెంపొందించే అంశాలను బోధిస్తున్నాం.
–ఎన్.మధుసూధనరావు,
శాఖాగ్రంధాలయ నిర్వాహకులు, గరుగుబిల్లి.
గరుగుబిల్లి: గ్రంథాలయాలు.. విద్యార్థుల భవితకు చక్కని విజ్ఞాన పునాదులు. వేసవి సెలవుల్లో పిల్లలకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఆట పాటలతో పాటు పుస్తక పఠనాసక్తిని పెంపొందిస్తున్నా యి. నైతిక, మానసిక వికాసం పెంపొందించేలా వివిధ కృత్యాలను నిర్వహిస్తున్నాయి. ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో ఒక మంచి పుస్తకంను మాత్రం కొనుక్కో’అన్న మాటకు అర్థం చెబుతూ పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలను చిన్నారులకు వివరిస్తున్నాయి. విద్యార్థుల భవితకు ఉపయోగపడేలా వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులను కొనసాగిస్తున్నాయి.
గ్రంథాలయాల బాటలో చిన్నారులు..
వేసవి సెలవులు వచ్చాయంటే చాలు నెలన్నరపాటు పిల్లల అల్లరి మిన్నంటుతుంది. ఇల్లు పీకి పందిరేస్తున్నారని పెద్దలు అనడం పరిపాటే. ఇందుకు భిన్నంగా ఆ సెలవులే చిన్నారుల విజ్ఞాన, వినోదాలకు నెలవు కావాలన్నదే గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ తరగతుల ఉద్దేశం. 45 రోజుల పఠనాభ్యసన దీక్షతో పాటు పిల్లల్లో సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసం పెంపొందించేలా గ్రంథాలయ అధికారులు శిక్షణ తరగతులు కొనసాగిస్తున్నారు.
గ్రంథాలయాలకు పిల్లలను
పంపించడం వల్ల కలిగే ప్రయోజనాలివీ..
● పిల్లలు వివిధ రకాల పుస్తకాలు చదువుకునే అవకాశం కలుగుతుంది.
● కొత్త విషయాలు తెలుసుకుంటారు. పిల్లలతో కలిసి ఉండడం వల్ల స్నేహభావం పెంపొందుతుంది.
● పిల్లలు కథలు చదవడం వల్ల పఠనాసక్తి పెరుగుతుంది. ఏ అంశాన్నైనా వివరించగల నైపుణ్యాలు పెంపొందుతాయి.
● చిత్రలేఖనం, పేపర్ ఆర్ట్, థియేటర్‌ఆర్ట్ వంటి సృజనాత్మక కార్యక్రమాల్లో తర్ఫీదు పొందుతారు.
జూన్ 6 తేదీ వరకు శిక్షణ తరగతులు
రాష్ట్రపౌర గ్రంథాలయ సంచాలకుడు కృష్ణమోహన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 28 నుంచి జూన్ 6వ తేదీ వరకు ఐదు నుంచి 15 ఏళ్లలోపు వయస్సు ఉన్న విద్యార్థులకు గ్రంథాలయాల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పుస్తకపఠనం, సమీక్షలు, కథలు చెప్పడం, రాయడం, చిత్రలేఖనం, నాటికలు, నీతిపద్యాలు, స్పోకెన్ ఇంగ్లిష్, చేతితో వివిధ ఆకృతుల తయారీ తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు నిష్ణాతులైన ఉపాధ్యాయులతో తెలుగు, గణితం, విజ్ఞాన శాస్త్ర పాఠ్యాంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
పిల్లల్లో పుస్తక పఠన జిజ్ఞాసను పెంపొందించేలా శిక్షణ
గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన తరగతులు

గ్రంథాలయాలు... విజ్ఞాన సోపానాలు

గ్రంథాలయాలు... విజ్ఞాన సోపానాలు

గ్రంథాలయాలు... విజ్ఞాన సోపానాలు