పీఏసీఎస్‌ రుణాల్లో.. బినామీల బాగోతం! | - | Sakshi
Sakshi News home page

పీఏసీఎస్‌ రుణాల్లో.. బినామీల బాగోతం!

May 8 2025 9:13 AM | Updated on May 8 2025 9:13 AM

పీఏసీఎస్‌ రుణాల్లో.. బినామీల బాగోతం!

పీఏసీఎస్‌ రుణాల్లో.. బినామీల బాగోతం!

వీరఘట్టం పీఏసీఎస్‌లో ఖాతాదారుల సంఖ్య: 3,014 మంది వీరికి ఇచ్చిన రుణాలు: రూ.29.25 కోట్లు ఇంత వరకు రెన్యువల్స్‌ అయిన రుణాలు: రూ.15.75 కోట్లు

ఓ రైతుకు రుణం వాడినట్టు తెలియదు.. ఆసలు ఆయన రుణం కోసం ఏనాడూ పీఏసీఎస్‌ మెట్లు ఎక్కలేదు. ఖాతా ఉన్నట్టు కూడా తెలియదు. కానీ ఆయన పేరిట రూ.లక్షపైబడి రుణం తీసుకున్నట్టు రికార్డుల్లో ఉంది. మరో రైతు చనిపోయి మూడేళ్లవుతోంది. ఆయన పేరిట రుణం వాడేశారు. ఇంకో వ్యక్తికి సెంటు భూమికూడా లేదు. ఆయన పేరిట రుణం తీసుకున్నట్టు రికార్డుల్లో ఉంది. వీరఘట్టం పీఏసీఎస్‌ లావాదేవీలన్నీ కంప్యూటరీకరణ కావడంతో బినామీల బాగోతం వెలుగులోకి వస్తున్నాయి.

వీరఘట్టం:

● వీరఘట్టం పీఏసీఎస్‌లో వ్యవసాయ రుణం తీసుకున్న మాణిక్యం సాంబమూర్తి మూడేళ్ల కిందట చనిపోయారు. గతంలో ఈయన తీసుకున్న రుణం ఇప్పుడు వడ్డీతో కలిపి రూ.43,445లు తీర్చాలని పీఏసీఎస్‌ అధికారులు వారికి ఇటీవల నోటీసు ఇచ్చారు.

● శంకరాపు నర్సమ్మ రెండేళ్ల కిందట చనిపోయింది. ఆమె పేరిట రూ.89,247 రుణం మంజూరైనట్టు ఉంది.

● గుమ్మడి పకీరు నాయుడు ఐదేళ్ల కిందట చనిపోయారు. ఆయన పేరిట రూ.14,900 రుణ బకాయి ఉంది.

● గొర్లె వరాలమ్మ రెండేళ్ల కిందట చనిపోయింది. ఆమె పేరిట రూ.1,19,878 రుణం ఉంది. ఇలా సుమారు 300కు పైగా మృతి చెందిన వారి పేరిట రుణాలు తీసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి. మరి ఈ రుణాలు ఎవరు తీసుకున్నారు, వీటిని ఎవరు చెల్లిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రుణాలు తీసుకున్నట్టే తెలియదట...

వీరఘట్టం పీఏసీఎస్‌లో కొప్పర అప్పలస్వామి పేరిట రూ.1,10,414 రుణం తీసుకున్నట్టు రికార్డుల్లో ఉంది. వాస్తవానికి ఆయన రుణం తీసుకోలేదని చెబుతున్నాడు. అలాగే, ఉదయాన వెంకటరావు పేరిట రూ.91,733లు, డర్రు నర్మమ్మ– రూ.17,944లు, వడంకి గోపి రూ.1,18,989లు, నల్ల రమణ రూ.90,397లు, వాన నాగభూషణరావు రూ.37,346లు, అల్లు వెంకటనాయుడు రూ.38,124లు, అల్లు లక్ష్మునాయుడు రూ.44,913లు, అలజంగి శ్రీనివాసరావు రూ.1,08,091లు, తాండ్రోతు నారంనాయుడు రూ.1,21,752లు, శంకరాపు లక్ష్మి రూ.1,23,024లు రుణం తీసుకున్నట్టు రికార్డుల్లో నమోదై ఉంది. పీఏసీఎస్‌లో తాము రుణాలు తీసుకోలేదని, తమ పేరిట ఎవరు తీసుకున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వందల సంఖ్యలో రైతుల పేరిట బినామీలు రుణాలు వాడినట్టు సమాచారం. రుణాలు చెల్లించాలంటూ పీఏసీఎస్‌ సిబ్బంది నోటీసులు ఇస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ ప్రమేయం లేకుండా రుణాలు ఎలా మంజూరు చేశారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక పీఏసీఎస్‌లో పనిచేసిన వ్యక్తి హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆయనే బినామీల పేరిట రుణాలు తీసుకున్నట్టు సమాచారం. పీఏసీఎస్‌ల లావాదేవీలన్నీ కంప్యూటరీకరణ చేస్తుండడంతో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.

ఇదీ పరిస్థితి....

వీరఘట్టం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 5,100 మంది రైతులు హక్కుదారులుగా ఉన్నారు. వీరిలో 3,104 మంది రైతులు సుమారు రూ.29.25 కోట్లు రుణాలు పొందినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇంత వరకు రూ.15.75 కోట్లు రుణాలు రెన్యువల్‌ అయ్యాయి. 1250 మంది రైతులపేరిట ఉన్న రూ.13.50 కోట్ల రుణాలు రెన్యువల్‌కావాల్సి ఉంది. రుణాలు తీసుకున్న రైతుల్లో చాలామంది చనిపోవడం, కొందరికి తమ పేరిట రుణం ఉందన్న విషయం తెలియకపోవడం సమస్యగా మారింది. రూ.13.50 కోట్లు రుణాల ఎవరి పేరిట ఉన్నాయో వారిని కట్టమని అధికారులు నోటీసులు ఇస్తున్నారు. ఈ విషయం బయటకు రానీయకుండా రైతుల పేరిట రుణాలు తీసుకున్న బినామీలు ఆపసోపాలు పడుతున్నారు. అధికారులు ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేపడితే బినామీల బాగోతం బయటపడుతుందని రైతులు చెబుతున్నారు.

వడ్డీ చెల్లించాలని

నోటీసులు ఇస్తున్నాం

ఏపీసీఎల్‌లో రుణాలు తీసుకుని వడ్డీలు కట్టని రైతులకు నోటీసులు ఇస్తున్నాం. నోటీసులు ఇస్తుంటే అసలు విషయం బయట పడుతోంది. ఏపీసీఎస్‌లో కంప్యూటరీకరణ కావడంతో అసలైన రైతులు ఎవరనేది స్పష్టమైంది. రుణాల వసూళ్లకు చర్యలు తీసుకుంటాం.

– జి.మధుసూదనరావు,స్పెషల్‌ ఆఫీసర్‌,పి.ఎ.సి.ఎస్‌,వీరఘట్టం.

వీరఘట్టం పీఏసీఎస్‌లో చనిపోయిన వారి పేరిట వ్యవసాయరుణాలు

భూములు లేని వారికి వ్యవసాయ రుణాలు

కంప్యూటరీకరణతో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు

రుణాలు కట్టనివారికి నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement