ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు
రేగిడి: ప్రస్తుతకాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే చాలా కష్టపడాల్సిందే. ఈ కష్టానికి తోడు అదృష్టం కలిసిరావాలి. అప్పుడే ప్రభుత్వ కొలువైనా..ప్రైవేట్ ఉద్యోగమైనా లభిస్తుంది. అటువంటిది రేగిడి మండలంలోని ఓ యువకుడిని ఒకే దఫా మూడు బ్యాంకు ఉద్యోగాలు వరించాయి. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొండవలస గ్రామానికి చెందిన బెవర చూడామణి ఒకే ప్రయత్నంలో మూడు బ్యాంకు ఉద్యోగాలు సాధించాడు. లోకల్ యూనియన్ బ్యాంకులో ఎల్‌బీఓగా, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రగా ప్రొబేషనరీ ఆఫీసర్‌గా, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆఫీస్ అసిస్టెంట్/క్యాషియర్‌గా ఉద్యోగాలు సాధించాడు. డిగ్రీ అనంతరం మూడు సంవత్సరాలు విజయవాడలో బ్యాంకు ఉద్యోగాల నిమిత్తం చూడామణి కోచింగ్ తీసుకుంటున్నాడు. చివరికి తన ప్రయత్నం ఫలించి, మూడు ఉద్యోగాలు సాధించి లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఆయన తండ్రి బెవర గోపాలకృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా, తల్లి గౌరీశ్వరి గృహిణి. కొద్దిపాటి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ సందర్భంగా చూడామణి మాట్లాడుతూ తన తల్లిదండ్రుల కష్టంతో పాటు రాజాంలోని ఎస్‌ఎల్‌టీఎన్ కళాశాల ప్రిన్సిపాల్, తన పినతండ్రి ఉదయ్‌భాస్కర్ రాజా ప్రోత్సాహంతో తాను ఈ కొలువులు సాధించానని వెల్లడించాడు.


