● పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
పాలకొండ రూరల్: మండలంలోని ఎల్‌ఎల్‌పురం గ్రామానికి చెందిన రేజేటి శేఖర్ తనను అదే గ్రామానికి చెందిన కొందరు విద్యుత్ స్తంభానికి కట్టి కొట్టారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.ప్రయోగమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై అందించిన వివరాలిలా ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన వారాడ రాజేంద్రనాయుడు, ఆయన సోదరుడు సుమంత్ నిర్వహిస్తున్న శ్రీ సాయిలక్ష్మి టౌన్‌షిప్‌లో కొద్ది రోజులుగా ఏజెంట్‌గా శేఖర్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇళ్ల స్థలాల కొనుగోలుపై ఆసక్తి ఉన్నవారిని గుర్తించి రూ.కోటి వరకూ చెల్లించి వంద మందిని టౌన్‌షిప్‌లో సభ్యులుగా చేర్పించాడు. రోజులు గడుస్తున్నప్పటికీ నగదు చెల్లించిన వారికి ఇళ్ల స్థలాలను టౌన్‌షిప్ యాజమాన్యం కేటాయించకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వడం లేదు. దీంతో ఈనెల 16వ తేదీన ఎల్‌ఎల్.పురంలో గల టౌన్‌షిప్ నిర్వాహకుల ఇంటికి వద్దకు టౌన్‌షిప్ సభ్యులతో కలిసి శేఖర్ వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో నిర్వాహకులు లేరని వారి తల్లి తలియజేయగా చేసేది లేక తిరిగివెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈనెల 17వ తేదీ సోమవారం ఉదయం బాధితుడు శేఖర్ ఊరి శివారులో కాలకృత్యాలు తీర్చుకుని తిరిగి ఇంటికి వస్తుండగా టౌన్‌షిప్ నిర్వాహకుల బంధువులు వియ్యపు మురళి, సోదరుడు బొజ్జంనాయుడులు శేఖర్‌ను అడ్డగించి, డబ్బు అడిగేందుకు ఇంటికి వస్తావా? అంటూ దూషించి విద్యుత్ స్తంభానికి కట్టి కొట్టినట్లు ఫిర్యాదు చేశాడని ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు.