పార్వతీపురంటౌన్: స్వచ్ఛసుందర పార్వతీపురం మన్యం జిల్లాయే అందరి లక్ష్యం కావాలని జిల్లా ప్రత్యేకాధికారి డాక్టర్ నారాయణ భరత్ గుప్త అన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మున్సిపల్ మార్కెట్ యార్డు వద్ద కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, మున్సిపల్ చైర్‌పర్సన్ బోను గౌరీశ్వరితో కలిసి ప్లాస్టిక్ నిషేధంపై శనివారం అవగాహన కల్పించారు. వాతావరణ కాలుష్యానికి, ప్రజల ఆరోగ్యానికి ప్లాస్టిక్ సంచుల వినియోగమే కారణమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా నుంచి ప్లాస్టిక్ భూతాన్ని పూర్తిస్థాయిలో తరిమేద్దామన్నారు. 70 మైక్రాన్ కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ వినియోగం ప్రమాదకరమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివారావు, కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గొట్టాపు వెంకటనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని డీఆర్వో హేమలత అన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో శనివారం వివిధ రకాల పండ్ల మొక్కలు నాటారు. మొక్కల పెంపకంతో కాలుష్య నియంత్రణ సాధ్యమన్నారు. కార్యక్రమంలో కార్యాలయ పర్యవేక్షకుడు రాధాకృష్ణ, ఉప తహసీల్దార్లు చంద్రమౌళి, రమణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం
పార్వతీపురం రూరల్: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎస్పీ క్యాంపు కార్యాలయం, రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిసరాలను పోలీస్ సిబ్బందితో కలిసి శనివారం పరిశుభ్రం చేశారు. పిచ్చిమొక్కలు తొలగించారు. చెత్తాచెదారాన్ని దూరంగా తరలించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అంకిత సురాన, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఏఆర్ ఆర్‌ఐ రాంబాబు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర అధికార సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాప్రత్యేకాధికారి డాక్టర్ నారాయణభరత్ గుప్త
ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం: కలెక్టర్
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
పార్వతీపురంటౌన్: జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం కావాలని జిల్లా ప్రత్యేకాధికారి డాక్టర్ నారాయణభరత్ గుప్త పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు. 2047 నాటికి వికసిత రాష్ట్రం కావాలన్నారు. విజన్ డాక్యుమెంట్ మేరకు కనీసం 15 ఽశాతం అభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ, సబ్‌కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, పాలకొండ సబ్‌కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, డీఆర్వో కె.హేమలత, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.రామచంద్రారెడ్డి, తదితర శాఖాధికారులు పాల్గొన్నారు.
స్వచ్ఛసుందర పార్వతీపురమే లక్ష్యం