
హెల్త్‌వలంటీర్ల నియామకం.. ప్రకటనలకే పరిమితం
గ్రామ సచివాలయ ఏఎన్‌ఎంలు
పర్యవేక్షిస్తున్నారు
గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్న ఏఎన్‌ఎంలు ఆశ్రమపాఠశాలల విద్యార్థులకు ఆరోగ్య తనిఖీలు చేపడుతున్నారు. అత్యవసర సమయంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. కొత్త ఏఎన్‌ఎంలను నియమించాల్సి ఉంది.
అన్నదొర, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ, సీతంపేట ఐటీడీఏ
సీతంపేట: గిరిజన విద్యాసంస్థల్లో హెల్త్ వలంటీర్‌ల నియామక ప్రక్రియ ప్రకటనలకే పరిమితమైంది. ఈ విద్యాసంవత్సరం మరో నెలరోజుల్లో ముగియనుంది. ఇంకా ఎప్పుడు హెల్త్ వలంటీర్‌లను ప్రభుత్వం నియమిస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు, అటు విద్యాసంస్థల యాజమాన్యాలు తలపట్టుకునే పరిస్థితి నెలకొంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 47 గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, 18 పోస్టు మెట్రిక్ వసతి గృహాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 15 వేల మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. ఆయా విద్యాసంస్థల్లో ఉచిత, భోజన వసతి కల్పిస్తూ విద్యాబోధన అందిస్తున్నారు. విద్యార్థులకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినప్పుడు ప్రాథమిక వైద్యసేవలు అందించడానికి వీలుగా హెల్త్ వలంటీర్‌లను నియమించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో ఏఎన్‌ఎంలను నియమిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు అది ప్రకటనలకే పరిమితమైంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే హెల్త్ వలంటీర్‌లను నియమిస్తామని గిరిజన సంఘాలకు హామీ ఇచ్చినా ఇంతవరకు పట్టించుకోలేదు.
ఒక్కో పాఠశాలలో 250 నుంచి 640 మంది
విద్యార్థులు
గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలల్లో ఒక్కో పాఠశాలలో కనీసం 250 నుంచి 640 వరకు సరాసరి విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు జ్వరం, ఇతర వ్యాధులు వచ్చినప్పుడు వెంటనే ప్రథమ చికిత్స చేయడం, బాలికా విద్యాసంస్థల్లో విద్యార్థినులకు నెలసరి సమయంలో కడుపులో నొప్పి ఇతర సమస్యలకు సరైన ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంది. అవసరమైతే దగ్గర్లో ఉన్న పీహెచ్‌సీకి తరలించాలి. హెల్త్ వలంటీర్‌లు లేకపోవడంతో అత్యవసర సమయాల్లో పాఠశాల సిబ్బందే ఆస్పత్రికి తరలిస్తున్నారు. వారి పని ఒత్తిడి వల్ల ఆస్పత్రులకు తీసుకువెళ్లడం ఒకటి రెండు రోజులు జాప్యం జరిగితే విద్యార్థుల ఆరోగ్యం విషమించే పరిస్థితి ఉంది. హెల్త్ వలంటీర్‌లను నియమిస్తే ఈ సమస్య ఉండదు. వారే ఆస్పత్రికి తీసుకువెళ్తారు. నెలలో సంబంధిత పీహెచ్‌సీ డాక్టర్లు ఒకసారి ఆయా పాఠశాలలను విజిట్ చేసి విద్యార్థులకు అనారోగ్య పరిస్థితులు ఉంటే చెక్ చేసి మందులు పంపిణీ చేస్తున్నారు.
గతంలో విద్యార్థుల మృతి ఇలా..
సీతంపేట ఐటీడీఏ పరిధి సరుబుజ్జిలి ఆశ్రమపాఠశాలలో చదువుతున్న సామరెల్లి గ్రామానికి చెందిన సవర రష్మిత గతేడాది జూలైనెలలో జ్వరంతో మృతి చెందింది. అదేనెలలో పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని రావికోన గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలో ఆరోతరగతి విద్యార్థి పి.రాఘవ అనారోగ్యంతో మృతిచెందాడు. అలాగే ఇదే నెలలో జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి విద్యార్థి బి.ఈశ్వరరావు మృతి చెందాడు. గుమ్మలక్ష్మీపురం మండలం పి.ఆమిటి గిరిజన సంక్షేమ పాఠశాలకు చెందిన ఎనిమిదోతరగతి విద్యార్థిని అవంతిక డెంగీతో మృతి చెందింది. ఇలా ఆశ్రమపాఠశాలల్లో మరణ మృదంగం వినిపిస్తున్నా ప్రభుత్వం కిమ్మనకపోవడం గమనార్హం.
రోగమొస్తే విద్యార్థులకు అవస్థలే

హెల్త్‌వలంటీర్ల నియామకం.. ప్రకటనలకే పరిమితం

హెల్త్‌వలంటీర్ల నియామకం.. ప్రకటనలకే పరిమితం