భామిని: ఐటీడీఏ పీఓ దృష్టికి ఆదివాసీల భూమి, ఇళ్ల సమస్యను తీసుకెళ్తానని భామిని తహసీల్దార్ నీలాపు అప్పారావు తెలిపారు. ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణాల కోసం 2018 సంవత్సరంలో సుమారు 36 ఎకరాల సాగు భూమిని ఆదివాసీలు ప్రభుత్వానికి అప్పగించారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఎకరా భూమి, 10 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చేందుకు అప్పటి పీఓ శివశంకర్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎలాంటి స్థలం కేటాయించకుండా ఇటీవల పాఠశాల స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి పూనుకోవడంతో ఆదివాసీలు ఆందోళనకు దిగారు. పాఠశాల స్థలంలో పూరిళ్ల నిర్మాణాన్ని తలపెట్టారు. ఇదే అంశంపై ‘పాఠశాల స్థలంలో పూరిళ్లు’ శీర్షికన సాక్షిలో వచ్చిన వార్తకు రెవెన్యూ అధికారులు స్పందించారు. ఆదివాసీలు పూరిళ్లు వేస్తున్న స్థలాన్ని తహసీల్దార్ పరిశీలించారు. సమస్య పరిష్కారానికి కృషిచేస్తామన్నారు.
మొల్ల రచనలు ఆదర్శనీయం
పార్వతీపురంటౌన్: కవయిత్రి మొల్లమాంబ రచనలు అందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. వాల్మీకి రామాయణాన్ని పామరులకు సైతం అర్థమయ్యేలా తెలుగు భాషలోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్ల అని గుర్తుచేశారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం మొల్లమాంబ జయంతిని నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి కలెక్టర్ పూలమాలను వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి మహర్షి రామాయణాన్ని సంస్కృత భాషలో 24 వేల పద్యాలుగా రచిస్తే, దానిని 671 పద్యాలుగా అందరికీ అర్థమయ్యేలా సరళమైన తెలుగు భాషలో రచించిన ఘనత ఆమెదని కొనియాడారు. కార్యక్రమంలో పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు అశుతోష్ శ్రీవాస్తవ, సి.యశ్వంత్ కుమార్‌రెడ్డి, డీఆర్వో కె.హేమలత, కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్ది, జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి ఎస్.కృష్ణ, జిల్లా శాలివాహన సంఘ అధ్యక్షుడు కొత్తూరు శంకరరావు, కార్యదర్శి ఉరిటి యాదవ్, తెప్పల శ్రీను, ఉరిటి సింహాచలం, ఉరిటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
వీఆర్ పురంలోనే ఏనుగులు
జియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం గ్రామంలోనే ఏనుగులు మూడు రోజులుగా తిష్టవేశాయి. వరి, జొన్న పంటలను ధ్వంసం చేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగులను తరలించే చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
15 పశువుల పట్టివేత
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మండలంలోని నర్సిపురం వద్ద కబేళాలకు రెండు బొలెరో వాహనాల్లో తరలిస్తున్న 15 పశువులను గురువారం స్వాధీనం చేసుకుని గోసంరక్షణశాలకు తరలించినట్టు పార్వతీపురం రూరల్ ఎస్‌ఐ బి.సంతోషి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సిపురం సమీపంలో మానాపురం సంతకు తరలిస్తుండగా మార్గంమధ్యలో రెండు బొలెరో వాహనాల్లో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనాలను సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు.
77 జీఓ రద్దుకు డిమాండ్
విజయనగరం గంటస్తంభం: జీవో నంబర్ 77 రద్దుచేసి పీజీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూడి రామ్మోహన్ డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ విజయనగరం డిగ్రీ కళాశాల విద్యార్థులు మయూరి కూడలి నుంచి కాంప్లెక్స్ వరకు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో చేపట్టారు. తక్షణమే రూ.3,680 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పీఓ దృష్టికి ఆదివాసీల సమస్య
పీఓ దృష్టికి ఆదివాసీల సమస్య