వివరాలు సరిచేసుకోకుంటే కార్డుదారులకు రేషన్ బంద్ నమోదుకు నెలాఖరు వరకు అవకాశం జిల్లాలో 30,624 మంది వివరాల నమోదు ఇంకా పెండింగ్
జిల్లా సమాచారం ఇదీ...
ఈ–కేవైసీ పూర్తి కాకుంటే సరుకులు నిలిపివేత
జిల్లా వ్యాప్తంగా ఈ–కేవైసీ చేయించుకోని రేషన్ కార్డుదారులకు సరుకుల సరఫరా నిలిపి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పలువురు కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. పనుల కాలం కావడంతో రేషన్ షాపుల వద్దకు వెళ్లలేక పలువురు రేషన్ తీసుకోవడం లేదు. దీంతో కార్డు ద్వారా వచ్చే ఇతర పథకాలూ ఆగిపోనున్నాయి.
సత్తెనపల్లి: జిల్లా వ్యాప్తంగా నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని 28 మండలాల్లో 1,289 చౌక దుకాణాలు ఉన్నాయి. 6,41,180 మంది రేషన్ కార్డులలో 18,47,940 మంది సభ్యులు ఉన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు 17,97,721 మంది ఈ–కేవైసీ పూర్తి చేయించుకున్నారు. 0–5 సంవత్సరాలలోపు చిన్నారులు 19,595 మంది ఉండగా వారికి ఈ–కేవైసీ అవసరం లేదు. ఇక మరో 30,624 మంది వివరాలు పెండింగ్‌లో ఉన్నాయి. 5 నుంచి 80 ఏళ్లలోపు వారు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. వీరంతా ఈ నెలాఖరులోపు ఈ– కేవైసీ చేయించుకోకుంటే రేషన్‌తోపాటు ప్రభుత్వ పథకాలు కూడా ఆగిపోనున్నాయి. పలువురు వలస పోవడం, ఈ–కేవైసీపై అవగాహన లేకపోవడం, వేలిముద్రలు పడక పోవటం, చౌకదుకాణాల డీలర్ల నిర్లక్ష్యం, తదితర కారణాలతో ఈ–కేవైసీ చేయించుకోలేకపోయారు. ఎక్కువగా జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో 2,040, పిడుగురాళ్లలో 2,014, చిలకలూరిపేటలో 1,888, మాచర్లలో 1,823, వినుకొండలో 1,798, సత్తెనపల్లిలో 1,537 మంది లబ్ధిదారులు ఈ–కేవైసీకి దూరంగా ఉన్నారు. స్పెషల్ డ్రైవ్ చేయించకపోతే వీరందరికీ రేషన్‌తోపాటు ప్రభుత్వ పథకాలు కూడా ఆగిపోనున్నాయి.
నెలాఖరు వరకు అవకాశం...
ఈ–కేవైసీ నమోదుకు ఈ నెలాఖరు వరకు అవకాశం ఉంది. గత ఏడాది మార్చి నుంచి జూన్ వరకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివిధ కార్యక్రమాలలో భాగంగా ఈ–కేవైసీ చేయించారు. రేషన్ కార్డుదారుల్లోని కుటుంబ సభ్యులు ఎవరు వేలిముద్ర వేసినా సరుకులు ఇస్తారు. ప్రత్యేకించి మృతుల పేర్లు తొలగించే విధానం లేకపోవడంతో వారికి రేషన్ పంపిణీ జరుగుతోంది. తాజాగా ఈ–కేవైసీ తప్పనిసరి చేయడంతో వీరి వివరాలు తొలగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ పరిధిలోకి వచ్చే వారుంటే వారిని గుర్తించనున్నారు. ప్రస్తుత ప్రక్రియతో రేషన్‌కార్డుల్లోని మృతులు, అనర్హుల వివరాలు తొలగి అసలైన లబ్ధిదారులకే నిత్యావసర సరకులు అందుతాయని అధికారులు భావిస్తున్నారు.
మొత్తం మండలాలు : 28
రేషన్ కార్డులు : 6,41,180
రేషన్ కార్డుల్లోని సభ్యులు : 18,47,940
మొత్తం చౌకదుకాణాలు : 1,289
ఈ–కేవైసీ చేయించుకోనివారు : 30,624


