చందోలు(కర్లపాలెం): స్థానిక బగళాముఖి అమ్మవారిని ఏపీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ టి.మల్లికార్జునరావు దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద మాజీ న్యాయమూర్తి దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకొచ్చారు. శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. అనంతరం వారికి పండితులు వేదాశీర్వచనాలను అందించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కె.చక్రధర్‌రెడ్డి, ఈవో నరసింహమూర్తిలు జడ్జికి అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలను అందజేశారు.
ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
పొన్నూరు: పట్టణంలోని సహస్ర లింగేశ్వరస్వామి దేవస్థానాన్ని మంగళవారం హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు కుటుంబ సమేతంగా సందర్శించారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారిని మాజీ జడ్జి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బొల్లాపల్లి: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ట్రాన్స్‌కో పల్నాడు జిల్లా ఎస్‌ఈ డాక్టర్ పి.విజయకుమార్ సిబ్బందికి సూచించారు. బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల సెక్షన్ పరిధిలో 33/11 కేవీ, గుమ్మనంపాడు, అయ్యన్నపాలెం, రావులాపురం, గండి గనుముల సబ్‌స్టేషన్‌లను ఎస్‌ఈ మంగళవారం తనిఖీ చేశారు. సబ్‌స్టేషన్ సిబ్బందికి, విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్వహణ గురించి పలు సూచనలు చేశారు. కరెంటు కోతలు, లో వోల్టేజ్ సమస్య లేకుండా చూడాలన్నారు. తనిఖీల్లో వినుకొండ డీఈఈ తన్నీరు శ్రీనివాసరావు, రేమిడిచర్ల సెక్షన్ ఏఈ బాణావత్ రామాంజనేయులు నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సెంట్రల్ జీఎస్టీ గుంటూరు కమిషనరేట్ నూతన కమిషనర్‌గా అరుణ్ రిచర్డ్ మంగళవారం గుంటూరు కన్నావారితోటలోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2007 సివిల్ సర్వీసెస్ బ్యాచ్‌కి చెందిన అరుణ్ రిచర్డ్ విశాఖపట్నం జీఎస్టీ, కస్టమ్స్ జోన్‌లోని ఐదు కమిషనరేట్లకు అప్పిలేట్ అథారిటీగా, సెంట్రల్ ట్యాక్స్, కస్టమ్స్ అప్పీల్స్ కమిషనర్‌గా పనిచేస్తూ గుంటూరు జీఎస్టీకి బదిలీపై వచ్చారు. కమిషనర్ మాతృబాష తెలుగు అయినప్పటికీ, తెలుగు రాష్ట్రాలలో పనిచేయడం ఆయనకు ఇదే మొదటిసారి. అరుణ్ రిచర్డ్‌ను అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కమిషనర్‌కు అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ, జాయింట్ కమిషనర్ దేవ్‌కుమార్, పీఆర్‌ఓ ఆర్.పి.పి. కుమార్‌లు స్వాగతం పలికారు. సిబ్బంది మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు.
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ తిక్కన కాన్ఫరెన్సు హాలులో మంగళవారం గుంటూరు రీజియన్ పరిధిలోని డిపో మేనేజర్లు, ట్రాఫిక్, మెకానిక్ ఇన్‌చార్జులతో ఆర్‌ఎం డి.సాంబ్రాజ్యం సమీక్ష సమావేశం నిర్వహించారు. డిపో అధికారుల పనితీరు, ఆదాయ మార్గాలు పెంపొందించేలా కేఎంపీఎల్ విధానాలపై సమీక్షించారు. బస్సులు మార్గంమధ్యలో ఎక్కడా బ్రేక్ డౌన్ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రద్దీకి తగ్గట్టు బస్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో పలువురు డిపో మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.


