ఒకే ఒక్కరు! | - | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్కరు!

May 20 2026 2:10 AM | Updated on May 20 2026 2:10 AM

పోస్టులు ఖాళీ రోగుల తాకిడి పీజీ సీట్లు పోయే ప్రమాదం

జీజీహెచ్‌ న్యూరాలజీలో ఆ ఒక్క డాక్టర్‌ సెలవు పెడితే రోగులకు తిప్పలే వేధిస్తున్న వైద్యుల కొరతపై దృష్టి పెట్టని చంద్రబాబు ప్రభుత్వం

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌ న్యూరాలజీ వైద్య విభాగంలో ఒకే ఒక్క డాక్టర్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవల కోసం పలు జిల్లాల నుంచి గుంటూరు జీజీహెచ్‌కు వస్తున్న రోగులు సత్వర వైద్య సేవలు లభించక అవస్థలు పడుతున్నారు. విధులు నిర్వహిస్తున్న ఆయన ఏదైనా అవసరానికి సెలవు పెడితే ఆ రోజు పీజీ వైద్య విద్యార్థులే రోగులను చూడాల్సిన దుస్థితి పేదల పెద్ద ఆసుపత్రి గుంటూరు జీజీహెచ్‌లో నెలకొంది.

గుంటూరు జీజీహెచ్‌ న్యూరాలజీ వైద్య విభాగంలో ప్రొఫెసర్‌ అండ్‌ హెచ్‌ఓడీ పోస్టు ఒకటి, అసోసియేట్‌ పోస్టు ఒకటి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు రెండు ఉన్నాయి. ప్రొఫెసర్‌ అండ్‌ హెచ్‌ఓడీగా పనిచేస్తున్న డాక్టర్‌ నాగార్జున కొండ వెంకటసుందరాచారికి రెండేళ్ల క్రితం గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా, అడిషనల్‌ డీఎంఈగా పదోన్నతి రావడంతో ఆయన వైద్య కళాశాలకు బదిలీ అయ్యారు. దీంతో రెండేళ్లుగా ప్రొఫెసర్‌ పోస్టు ఖాళీగా ఉంది. వైద్య విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫసర్లుగా పనిచేస్తున్న డాక్టర్‌ బిందు నర్మద, డాక్టర్‌ భార్గవిలకు రెండు నెలల క్రితం అసోసియేట్‌లుగా పదోన్నతి వచ్చి ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. దీంతో న్యూరాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా విధుల్లో ఉన్న డాక్టర్‌ గాజుల రామకృష్ణ ఒక్కరు మాత్రమే వైద్య విభాగంలో సేవలు అందిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు పెట్టడంతో న్యూరాలజీ రోగులకు ఓపీ చూసే వారే లేకుండా పోయారు.

న్యూరాలజీ ఓపీ విభాగంలో మంగళవారం, గురువారం, శనివారం మాత్రమే సేవలు అందిస్తున్నారు. జిల్లాతోపాటు పల్నాడు, బాపట్ల, ప్రకాశం తదితర జిల్లాలకు చెందిన రోగులు సైతం వస్తున్నారు. డాక్టర్‌ ఎన్‌.వి.సుందరాచారి విభాగాధిపతిగా పనిచేస్తున్న సమయంలో దాతల సహాయంతో స్ట్రోక్‌ యూనియన్‌ను, స్ట్రోక్‌ ఐసీయూ అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్లీప్‌ ల్యాబ్‌, ఇతర స్పెషాలిటీ ల్యాబ్‌లను సైతం ఏర్పాటు చేశారు. దీంతో న్యూరాలజీ విభాగంలో ఓపీకి రోజూ 200 నుంచి 300 మంది రోగులు చికిత్స కోసం వస్తున్నారు. పక్షవాతం సంబంధిత రూ. 50 వేల ఖరీదు చేసే ఇంజక్షన్లు ఉచితంగా ఇస్తుండటంతో బాధితులు రెగ్యులర్‌గా వస్తున్నారు. వైద్య సిబ్బంది లేక రోగులు ఆందోళన చెందుతున్నారు. ఆ భారమంతా పీజీ వైద్యులపై పడుతోంది. న్యూరాలజీ పీజీలో చేరిన వైద్య విద్యార్థులు... సీనియర్‌ వైద్యుల పోస్టుల ఖాళీ వల్ల నాణ్యమైన బోధన అందుకోవడం లేదు. రోగుల వైద్యచికిత్సల పని భారంతో వారు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతి ఏడాది ఎంబీబీఎస్‌, పీజీ కళాశాల అడ్మిషన్‌ల సమయంలో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంపీ) నిబంధనల ప్రకారం పీజీ సీట్లు వైద్య కళాశాలలో కొనసాగాలంటే ప్రొఫెసర్‌, అసిస్టెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం న్యూరాలజీ పీజీ సీట్లు నాలుగు ఉన్నాయి. డాక్టర్‌ సుందరాచారి చొరవతో వైద్య కళాశాల న్యూరాలజీ విభాగం ఏర్పడిన 40 ఏళ్ల తరువాత ఇవి మంజూరయ్యాయి. ప్రస్తుతం వైద్య పోస్టులు ఖాళీగా ఉండటంతో ఈ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. పీజీ వైద్య విద్యార్థులు సైతం చేరేందుకు ఆసక్తి చూపించలేదు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు చొరవ చూపి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు లభించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. పీజీ వైద్య విద్యార్థులకు నాణ్యమైన బోధన జరిగేలా ఖాళీ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement