25 నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

25 నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు

May 20 2026 2:10 AM | Updated on May 20 2026 2:10 AM

జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ

గుంటూరు వెస్ట్‌: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ తెలిపారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షలకు రెగ్యులర్‌ పదవ తరగతి విద్యార్థులతోపాటు, ఓపెన్‌ స్కూలింగ్‌ పదవ తరగతి విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. జిల్లాలో మొత్తం 18 పరీక్ష కేంద్రాలలో మొత్తం కలిపి మూడు వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని చెప్పారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ప్రాథమిక అవసరాలైన తాగునీరు, విద్యుత్‌, ఫ్యాన్లు, మరుగుదొడ్ల సౌకర్యం ఉండాలని, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఓఆర్‌ఎస్‌తో పాటు అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. వేసవి తీవ్రత రీత్యా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ విధించడం జరుగుతుందని, పోలీసు బందోబస్తు పటిష్టంగా ఉండాలన్నారు. ప్రశ్నా పత్రాలు, జవాబు పత్రాలను ఆయా ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, ఇన్విజిలేటర్లను నియామకం పూర్తి చేయాలన్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్‌ షేక్‌ సలీంబాషా మాట్లాడుతూ 18 పరీక్ష కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశామని, సిబ్బందిని నియమించామని చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షల నిర్వహణకు అధికారులందరు సహకరించాలని కోరారు. సమావేశంలో డీఆర్వో షేక్‌ ఖాజావలి, డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement