తవ్వారు.. వదిలేశారు.. ఉసురు తీశారు | - | Sakshi
Sakshi News home page

తవ్వారు.. వదిలేశారు.. ఉసురు తీశారు

May 20 2026 2:10 AM | Updated on May 20 2026 2:10 AM

తవ్వారు.. వదిలేశారు.. ఉసురు తీశారు

చీకట్లో గుంత కానరాక...

పైపులైన్‌ మరమ్మతుల

కోసం తీసిన గుంతతో ప్రమాదం

చీకట్లో గుంత తాలూకా

మట్టిదిబ్బను ఢీకొన్న బైక్‌

అక్కడికక్కడే వ్యక్తి మృతి..

మరొకరికి తీవ్ర గాయాలు

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో మోటార్‌ బైక్‌పై వస్తున్న ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలో నివాసం ఉండే షేక్‌ మొహమ్మద్‌ (38) కార్పెంటర్‌గా జీవనం కొనసాగిస్తాడు. ఇతనికి భార్య షేక్‌ జాహెదాతో పాటు తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు షేక్‌ మాలిక్‌తో పాటు ఏడో తరగతి చదువుతున్న షేక్‌ మొహమ్మద్‌ ఆలి ఉన్నారు. సోమవారం రాత్రి 11.30 సమయంలో చిలకలూరిపేట నుంచి తన మిత్రుడు షేక్‌ సర్ధార్‌తో కలసి మోటార్‌బైక్‌పై పసుమర్రుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు.

● మృతుడి నివాసమైన పసుమర్రు మసీదు వీధి ప్రాంతం శోక సంద్రంలో మునిగి పోయింది. చిలకలూరిపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. తీరా ప్రమాదం జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోయాక ఉదయాన్నే సంబంధిత గుంతను మూసివేయడం విశేషం. ఇదే పని సకాలంలో చేసి ఉంటే ఒక ప్రాణం నిలిచి ఉండేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

తవ్వాం..పనిచూసుకున్నాం.. వదిలేశాం.. మాపని మేం చేసేశాం ఎవరెటు వచ్చి పడి చస్తే మాకేం.. అనుకున్నారేమో పురపాలక సిబ్బంది పనిముగించుకుని తాపీగా ఇళ్లకెళ్లిపోయారు. గుంత లోతుగా ఉందని, గుంత చుట్టూ వేసిన మట్టికుప్ప ఎత్తుగా ఉందని, రాత్రిళ్లు ఎవరైనా కనబడక వచ్చి అందులో పడతారనే కనీస స్పృహలేకుండా.. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా గత పదిరోజులుగా గాలికి వదిలేశారు. చీకట్లో పాపం ఆ గుంత, చుట్టూ ఉన్న మట్టి కనబడక ఓ అమాయకుడు మృత్యవాత పడగా.. అతనిపై ఆధారపడిన భార్య, 9,7 తరగతులు చదువుతున్న పిల్లలు రోడ్డున పడ్డారు. పురపాలక నిర్లక్ష్యం ఓ అన్నెం పున్నెం ఎరుగని వ్యక్తిని బలితీసుకుని, ఓ కుటుంబంలో పెనువిషాదం నింపగా.. ఉదయాన్నే వచ్చిన సిబ్బంది గుంతతో పాటు తమ తప్పులను కప్పేయాలని చూడడం విశేషం.

సుమారు పది రోజుల కిందట చీరాల రోడ్డులో కక్కెరదాసయ్య గోడౌన్ల సమీపంలో పైపులైన్‌ మరమ్మతుల కోసం రోడ్డు మార్జిన్‌లో గుంత తీయించిన మున్సిపల్‌ సిబ్బంది దానిని పూడ్చి వేయించకుండా వదలివేశారు. గుంత చుట్టూ బ్యారికేడ్‌, లేదా రేడియం రిబ్బన్‌ వంటిది ఏర్పాటు చేయలేదు. ప్రమాద ప్రదేశం చీకటిగా ఉండటం, వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే చీరాల రోడ్డులో ఎదురుగా వస్తున్న వాహనాల లైటింగ్‌ కారణంగా ద్విచక్రవాహనం రోడ్డు మార్జిన్‌ దిగింది. ఈ క్రమంలో పైప్‌లైన్‌ మరమ్మతుల కోసం గుంత తీసి వేసిన మట్టి దిబ్బను బైక్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో మొహమ్మద్‌ తల సమీపంలో ఉన్న రాళ్లకు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ వెనుక కూర్చొన్న సర్ధార్‌ తీవ్ర గాయాలపాలుకాగా సమీపంలోని ప్రభుత్వాసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. మొహమ్మద్‌ మృత దేహాన్ని పోస్టుమార్టం అనంతరం మంగళవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. భర్తను కోల్పోయి భార్య, తండ్రిని కోల్పోయిన కుమారులు, కొడుకును కోల్పోయి వృద్ధులైన తల్లిదండ్రులు ఫరీసా, ఫాతిమాలు విలపిస్తున్న తీరు హృదయవిదారకంగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement