టీడీపీ ఆఫీసుకోసం చెరువునే ఎండబెట్టారు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ ఆఫీసుకోసం చెరువునే ఎండబెట్టారు

May 20 2026 2:10 AM | Updated on May 20 2026 2:10 AM

పార్టీ కార్యాలయం పేరుతో

యథేచ్ఛగా మట్టి తరలింపు

చెరువులోని నీటిని బయటకు

తరలించి మరీ తవ్వకాలు

చెరువులో పెద్ద ఎత్తున గోతులు..

వందలాది ట్రిప్పులు

పట్టించుకోని అధికారులు

ముప్పాళ్ళ: మట్టి కోసం ఏకంగా నిండుకుండలా ఉండే ముప్పాళ్ళ చెరువునే ఎండబెట్టారు తెలుగుదేశం పార్టీ ముప్పాళ్ల నాయకులు. ముప్పాళ్ళలోని పెదనందిపాడు బ్రాంచి కాలువ సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం పేరుతో ముప్పాళ్ళ చెరువును ఖాళీ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రమాదం పొంచి ఉందని, వర్షాలు కురిసే అవకాశం లేదని, నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలని, చెరువుల్లో ఉన్న నీటిని కూడా జాగ్రత్తగా వినియోగించుకోవాలని, నీటిని బయటకు వెళ్లబెట్టకూడదని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ.. ఇక్కడ అధికారులకు చీమకుట్టినట్లుగా కూడా లేకుండా పోయింది. జలధార పేరుతో చెరువులను బలోపేతం చేయాల్సింది పోయి చెరువులోని నీటిని బయటకు పంపి మట్టి అమ్ముకుంటున్నారు. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటి నీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు గాలికొదిలేశారు. చెరువులో పెద్ద ఎత్తున గోతులు పెట్టి వందలాది ట్రిప్పులు మట్టిని తరలిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు, పోలీస్‌స్టేషన్‌ ఎదురు గుండా మట్టి ట్రాక్టర్‌లు తరలివెళుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రైతులు పొలాల్లో మట్టిని తరలించుకోవాలంటే సవాలక్ష అనుమతులు కావాలంటూ ఇబ్బందులు పెట్టే అధికారులు ఏమీ తెలియనట్లుగానే వ్యవహరిస్తున్నారు. చెరువులో నీటిని వెళ్లబెట్టడమే కాకుండా, ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం పై ఆ పార్టీలోని వారే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎన్‌ఎస్‌పీ స్థలంలో పార్టీ కార్యాలయమా..?

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ కుడి కాలువ పరిధిలో ఉన్నటువంటి భూమిలో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణపనులు చేపట్టారు. అప్పట్లోనే సాగర్‌ ఆయకట్టు పరిధిలో దిగువ భూములకు నీటి తరలింపు కోసం నిర్మించిన కాలువలకు ఇరువైపులా 100 అడుగుల మేర ఖాళీ స్థలాన్ని వదిలి పెట్టి కాలువలు తవ్వారు. ఏదైనా అత్యవసర సమయాల్లో ప్రమాదం సంభవించి కాల్వలకు గండి పడితే పక్కనే ఉన్న ఎన్‌ఎస్‌పీ స్థలంలోని మట్టిని కట్టలకు వినియోగించుకోవాల్సి ఉండేందుకు వినియోగించుకోవాల్సి ఉంది. రైల్వే, ఎన్‌ఎస్‌పీ స్థలాలు ఆక్రమించటం చట్టరీత్యా నేరం. అలాంటి స్థలాల్లో అనుమతులు లభించటం కూడా అరుదు. అయితే అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు చట్టాలు వర్తించకుండా పోయాయి. ఏకంగా ఎన్‌ఎస్‌పీ కాలువకు సంబంధించిన 0.20 సెంట్ల భూమినే కబ్జా చేస్తున్నారు. అందులో ఏకంగా నిర్మాణాలకు తెర లేపారు. ఎన్‌ఎస్‌పీ అధికారులు కూడా ఏమీ తెలియనట్లుగానే మౌనముద్ర వహిస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలానే వదిలేస్తే భవిష్యత్తులో ప్రభుత్వ కార్యాలయాల్లోను, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన స్థలాల్లోను రాజకీయ పార్టీలకు చెందిన భవనాల నిర్మాణాలు జరిగే ఆస్కారం లేక పోలేదనే అనుమనాలు పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎన్‌ఎస్‌పీ స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement