పొన్నూరు: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అనుచరులు చేసిన దాడిలో నష్టపోయి, అక్రమ కేసులు ఎదుర్కొంటున్న మొక్కజొన్న రైతులను పరామర్శించి సంఘీభావం తెలియజేసేందుకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపుడి ప్రభాకరరావు బుధవారం మామిళ్లపల్లి గ్రామానికి వస్తున్నారని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు.
మంగళగిరి టౌన్: ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. విశాఖపట్నం అగనంపూడికి చెందిన వరసాల ప్రవీణ్‌కుమార్(32) మంగళగిరి మండలంలోని నీరుకొండలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో నాలుగు సంవత్సరాల నుంచి ప్లేస్‌మెంట్ సెల్‌లో పనిచేస్తున్నాడు. ఈనెల 15వ తేదీ కుటుంబ సభ్యులందరూ కాకినాడ వెళ్లడంతో ప్రవీణ్‌కుమార్ కూడా కాకినాడ వెళ్లాడు. 17వ తేదీ కాకినాడ నుంచి తిరుగు ప్రయాణంలో బస్సులో బయలుదేరి 18వ తేదీన మంగళగిరికి చేరాడు. మంగళగిరి పట్టణ పరిధిలోని తెనాలి ఫ్‌లై ఓవర్ వద్ద బస్సుదిగి రాజీవ్ సెంటర్‌కు వచ్చే క్రమంలో ప్రవీణ్‌కుమార్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న సహ ఉద్యోగి సునీల్ మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. చికిత్స పొందుతూ ప్రవీణ్‌కుమార్ మృతి చెందాడు. మృతుడు తండ్రి జేమ్స్‌రాజ్ ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో 112 దొంగతనాల కేసులు నమోదు
నగరంపాలెం: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడే చిల్లర సురేష్ అలియాస్ చల్లా సురేష్‌పై పీడీ యాక్ట్‌ను గుంటూరు జిల్లా పోలీసులు ప్రయోగించారు. ఈ మేరకు అతన్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో సుమారు 112 దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పారు. అతను అనేకమార్లు జైళ్లకు వెళ్లినా నేర ప్రవత్తి మారలేదన్నారు. ప్రజల్లో భయాందోళనలు స్పష్టిస్తున్న చిల్లర సురేష్‌పై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు నల్లపాడు పీఎస్ పోలీసులు నిరంతర నిఘా ఏర్పాటు చేశారన్నారు. వరుస నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్లు నిఘాలో వెల్లడైందని అన్నారు. దీంతో అతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా కలెక్టర్ సీఎం.సాయికాంత్‌వర్మకు సిఫార్సు చేశారని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సిఫార్స్‌తో ముద్దాయిపై పీడీ యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. 38 ఏళ్ల వయసున్న చిల్లర సురేష్ పై తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో 2024 –26 వరకు సుమారు 112 చోరీల కేసులు నమోదైనట్లు జిల్లా పోలీసులు తెలిపారు.


