ఆగని అక్రమ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

ఆగని అక్రమ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం

Apr 6 2026 8:00 AM | Updated on Apr 6 2026 8:00 AM

రాష్ట్ర హైకోర్టు, వక్ఫ్‌బోర్డు ఆదేశాలను పట్టించుకోని నిర్మాణదారులు షాపింగ్‌ కాంప్లెక్స్‌కు అనుమతులు ఇవ్వని మున్సిపల్‌ అధికారులు

నరసరావుపేట: పట్టణంలోని శ్రీరాంపురం జామియా మసీదు పక్కన వక్ఫ్‌బోర్డు స్థలంలో ఆ సంస్థల ముందస్తు అనుమతి లేకుండా, మున్సిపల్‌ నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా అంజుమన్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం జరుగుతూనే ఉంది. శనివారం కూడా కొందరు కూలీలు పనులు చేస్తూ కన్పించారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తుంగలో తొక్కి వక్ఫ్‌బోర్డు అధికారులను పట్టించుకోకుండా టీడీపీ ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమార్కులు యథేచ్ఛగా నిర్మాణం చేస్తున్నారు. కొందరు టీడీపీ మైనార్టీ నాయకులు పాత షాపుల యజమానులను పక్కనపెట్టి పట్టణంలోని కొందరు వ్యక్తుల వద్ద లక్షలకు లక్షలు డబ్బులు వసూలుచేసి వారికి షాపులు కేటాయిస్తున్నారని మాజీ కౌన్సిలర్‌ షేక్‌ జాని మౌలాలీ ఆరోపిస్తున్నారు. వివరాలు.. వక్ఫ్‌బోర్డు స్థలంలో ముస్లిం మైనార్టీలు 72 షాపులతో వ్యాపారాలు చేస్తుండగా 2018లో నూతన షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం పేరుతో టీడీపీ నాయకులు కాంప్లెక్స్‌ను కూల్చివేశారు. వెంటనే షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేయలేకపోయారు. ఆ తర్వాత ప్రభుత్వం మారి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చింది. అప్పటి ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాత వ్యాపారులకే షాపులు కేటాయించటం జరుగుతుందని, ఎవరికీ అన్యాయం చేయబోమని ప్రకటించి షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టగా కొందరు టీడీపీ వ్యక్తులు కోర్టును ఆశ్రయించి నిర్మాణంపై స్టే తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొందరు వ్యక్తులు జామియా మసీదుకు తామే వారసులం అంటూ అదిలే సున్నత్‌ జామియా మసీదు సంఘం పేరుతో ఒక ప్రైవేటు సంఘం సృష్టించారు. పాత షాపుల యజమానులు, మరికొందరు నూతన వ్యక్తుల వద్ద డబ్బులు వసూలు చేసి అనధికారికంగా నిర్మాణం చేపట్టారు. దీనిపై మాజీ కౌన్సిలర్‌, మసీదు మేనేజ్‌మెంట్‌ కమిటీ సెక్రటరీ షేక్‌ జాని మౌలాలి, మరో వ్యక్తి కలిసి హైకోర్టును ఆశ్రయించగా నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి, వారం రోజులలో తమకు నివేదిక అందజేయాలని షేక్‌ రహమత్‌ఆలీ, మున్సిపల్‌, వక్ఫ్‌బోర్డు అధికారులు, పిటిషనర్లు సూచించిన నిర్మాణ దారులకు నోటీసులు జారీ చేసింది. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో మున్సిపల్‌ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. దీంతో నిర్మాణ మేస్త్రిగా ఉన్న వ్యక్తిని తప్పించి మరో వ్యక్తి ద్వారా కూలీల సహాయంతో నిర్మాణం చేస్తున్నారు. దీనిపై జాని మౌలాలి వక్ఫ్‌బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీనిపై వక్ఫ్‌బోర్డు అనుమతిలేకుండా షాపులు ఎందుకు నిర్మిస్తున్నారు, ఎంత డబ్బులు వసూలు చేశారో చెప్పాలని కోరుతూ రహమత్‌ఆలీ అనే వ్యక్తికి బోర్డు సీఓ నోటీసులు ఇచ్చారు. దీనిపై జిల్లా వక్ప్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ నూహ్‌ ఆలీషాను వివరణ కోరగా జరుగుతున్న నిర్మాణాలను ఆపాలని నోటీసులు అందజేశామని, అయినప్పటికీ నిర్మాణం జరుగుతూనే ఉందని, దీనిపై పోలీసుల సహాయంతో నిర్మాణం ఆపేందుకు వక్ఫ్‌బోర్డు అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement