సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతున్న నాటికలు | - | Sakshi
Sakshi News home page

సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతున్న నాటికలు

Apr 6 2026 8:00 AM | Updated on Apr 6 2026 8:00 AM

మూడో రోజుకు చేరిన నాటిక ప్రదర్శనలు

యడ్లపాడు: పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 23వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు చివరి రోజైన ఆదివారం అట్టహాసంగా కొనసాగాయి. తెలుగు నాటక పరిషత్‌ల సమ్మేళన సంఘం వేదిక, సుందరయ్య కళా పరిషత్‌ అధ్యక్షులు డాక్టర్‌ ముత్తవరపు సురేష్‌బాబు నేతృత్వంలో నిర్వహిస్తోన్న ఈ కళారూపాలు సమకాలీన పరిస్థితుల్ని ఆవిష్కరించాయి. వీటితోపాటు యడ్లపాడు మానవతా సాగరి వారి ప్రత్యేక ప్రదర్శన మంచివారే కానీ..నాటిక హాస్యం, సామాజిక బాధ్యత అవశ్యం అంశాల్ని సున్నితంగా స్పృశించాయి. ఇక మూడోరోజున ముచ్చటగా ప్రదర్శించిన మూడు నాటికలు ప్రేక్షకులను ఎంతో రంజింపజేశాయి.

ముగింపు లేని కన్నీటి కావ్యం

‘మమ్మల్ని బతకనివ్వండి’

రెక్కలు వచ్చి ఎగిరిపోయిన పిల్లల జ్ఞాపకాల మధ్య, పెన్షన్‌ డబ్బులే ప్రాణాధారంగా బతుకుతున్న ఆ వృద్ధ జంటను జలప్రళయం చుట్టుముట్టగా, రక్షించాల్సిన వారే రాబందులై దోచుకున్న వైనం సమాజపు నైతిక పతనాన్ని ఈ నాటిక కళ్లకు కట్టింది. కుండపోత వర్షంలో చావుకు చేరువైన భార్యను కాపాడుకునేందుకు ఆ వృద్ధుడు తన వద్దనున్న సర్వస్వాన్ని ధారపోసినా, చివరకు ఆమె మూర్ఛవ్యాధితో కన్నుమూయడం ప్రేక్షకులను కంటతడి పెట్టించే విషాదాంతం. ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవాల్సిన మానవత్వం మంటగలిసి, వాణిజ్య విలువల ముసుగులో సామాన్యుడి ప్రాణం ఎలా గాలిలో కలిసిపోతుందో ఈ నాటిక లోతైన సందేశాన్ని ఇచ్చింది. విజయవాడ సాంస్కృతిక సమితి(విజయవాడ) వారు ప్రదర్శించిన ఈ నాటికకు సుఖమంచి కోటేశ్వరరావు అందించిన రచన, దర్శకత్వం వహించారు.

మానవత్వం నిండుకున్న ‘మంచి మనసులు’

ఆపదలో ఉన్న తోటి మనిషిని చూసి ముఖం చాటేయకుండా, కష్ట సుఖాలను పంచుకుంటూ చేయూతనివ్వడమే నిజమైన దైవత్వమని ఈ నాటిక ఇతివృత్తం. స్వార్థం రాజ్యమేలుతున్న కాలంలో మనుషుల మధ్య కేవలం అవసరాల బంధాలే కాకుండా, అంతకు మించిన సున్నితమైన అనుబంధాలు, నిస్వార్థమైన సేవ ఉండాలని చూపిన ప్రతి సన్నివేశం మనసులను కదిలిస్తుంది. అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలనే ఉన్నత ఆశయంతో, సామాజిక బాధ్యతను గుర్తుచేస్తూ సమాజం సుభిక్షంగా ఉండటానికి మానవీయ విలువలూ ప్రాణవాయువు లాంటివని ఈ నాటిక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ఉషోదయ కళానికేతన్‌ (కట్రపాడు) వారు ప్రదర్శించిన ఈ నాటిక రచన, దర్శకత్వం చెరుకూరి సాంబశివరావు వహించారు.

తెగిన తరాల అనుబంధం ‘చిటికెన వేలు’

అడవి తల్లి ఒడిలో స్వేచ్ఛగా సాగే సోమన్న జీవన పోరాటాన్ని, నాగరికత పేరిట ప్రవేశించిన దోపిడీ శక్తులు ఎలా కబళించాయో చిటికెన వేలు నాటిక అద్దం పడుతుంది. తాతా మనవళ్ల మధ్య వారసత్వంగా అందిన చిటికెన వేలు బంధం మారుతున్న కాలం తెచ్చిన కొత్త పోకడల వల్ల తెగిపోవడం..తన భూమిని, ఉనికిని కోల్పోయి సోమన్న ఒంటరివాడవ్వడం నేటి సామాజిక మార్పులోని క్రూరత్వాన్ని ఎండగట్టింది. గూడెం సంస్కృతిని మింగేస్తున్న ఆధునికతను నిరసిస్తూ, మూలాలను కోల్పోతున్న మనిషి నిస్సహాయతను ఈ కథాంశం సమాజానికి ఒక హెచ్చరికలా చాటిచెప్పింది. తెలుగు కళాసమితి(విశాఖపట్నం) వారు ప్రదర్శించిన ఈ నాటికను అట్టాడ అప్పలనాయుడు రచించగా చలసాని కృష్ణప్రసాద్‌ దర్శకత్వం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement