వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించను ఇబ్బందులు పెట్టిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టేదిలేదు సత్తెనపల్లిలో ముఖ్య నాయకులు, కార్య కర్తల సమావేశం
సత్తెనపల్లి: చిన్న చిన్న మనస్పర్థలు వీడి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్లీ జగనన్నని ముఖ్యమంత్రి గా చేసుకోవడమే లక్ష్యంగా సైనికుల్లా పని చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్‌కే) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సత్తెనపల్లిలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి అధ్యక్షత వహించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో కార్యకర్తలకు ఎంతో అవమానం జరుగుతుందని, కార్యకర్తలకు జరిగిన నష్టాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. ఈసారి కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. ప్రజలకు మేలు చేసేందుకు నాడు వలంటీర్ వ్యవస్థను రూపొందించి వారి ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమాన్ని చేరవేశామని, ఆ సమయంలో కొందరు మనలో ఉన్న మనస్పర్థలను దృష్టిలో పెట్టుకొని వారికి లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసుకొని, కొందరు పోలీసులు అక్రమ కేసులు పెట్టడం, కొందరు అధికారులు ఇబ్బందులు పెట్టడం జరుగుతుందని, మనం అధికారంలోకి వచ్చాక ఇబ్బందులు పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఎవరికి అన్యాయం జరిగినా డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. అమలు సాధ్యం కానీ హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, వీటికి టీడీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. టీడీపీ అక్రమాలు, అరాచక పాలనను ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికలు ఏవైనా ఆ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం తథ్యమని, పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలను వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. ఒకవేళ నియోజక వర్గాల పునర్విభజన జరిగి ఒకటి రెండు స్థానాలు పెరిగినా అవి కూడా వైఎస్సార్ సీపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేసి అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా పోరాడాలని సూచించారు. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి, పార్టీ పరిశీలకుడు రేపాల శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకులు చిట్టా విజయభాస్కరరెడ్డి, బాసు లింగారెడ్డి, పక్కాల సూరిబాబు, డాక్టర్ గజ్జల నాగభూషణ్‌రెడ్డి, డాక్టర్ గీత హాసంతి, చల్లంచర్ల సాంబశివరావులు మాట్లాడారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ కన్వీనర్లు రాయపాటి పురుషోత్తమరావు, నక్కా శ్రీనివాసరావు, వేపూరి శ్రీనివాసరావు, భవనం రాఘవరెడ్డి, పార్టీ నాయకులు మర్రి వెంకటసుబ్బారెడ్డి, కొర్లకుంట వెంకటేశ్వర్లు, సంకటి శ్యాంసన్, రాజారపు శివ నాగేశ్వరరావు, చిలుకా జైపాల్, షేక్ జలీల్, తుమ్మల వెంకటేశ్వరరావు, షేక్ ముక్త్యార్, ఎమ్.ఏడుకొండలు,ఇందూరి నరసింహారెడ్డి కాల్వపల్లి బ్రహ్మారెడ్డి, గొల్లమారి వెంకట్రామిరెడ్డి, మేడం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, షేక్ జాని, సయ్యద్ గోరా, జేఎస్‌కే జానీ, షేక్ మహమ్మద్ గని పాల్గొన్నారు.


