వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పలు గ్రామాల్లో వలసకూలీలను పరామర్శ
నరసరావుపేట: రాష్ట్రంలోని వలస కార్మికులకు రక్షణ చట్టం తక్షణమే అమలు చేసి చనిపోయిన వారికి రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. వలస ప్రాంతాల్లో ఉచిత రవాణా, నివాసం, తాగునీరు, వైద్యం, రేషన్ సదుపాయాలు కల్పించడంతో పాటు పిల్లల విద్య ఆగిపోకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కర్నూలు జిల్లా నుండి మిర్చి కోత పనుల కోసం నరసరావుపేట మండలం కేసానుపల్లి, ఇర్లపాడు గ్రామాలకు వలస వచ్చిన కార్మికులను ఆదివారం సంఘం రాష్ట్ర నాయకుడు వి.వెంకటేశ్వర్లు, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల కార్యదర్శులు జి.రవిబాబు, ఈ.అప్పారావు, కంకణాల ఆంజనేయులు పరామర్శించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ కార్మికుల దుస్థితి దారుణంగా మారిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి లేక గ్రామాలు ఖాళీ అవుతుండగా, వలసల బారిన పడిన కూలీల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని మండిపడ్డారు. నాలుగు నెలలుగా గ్రామాల్లో వ్యవసాయ కార్మికులకు పనులు లేకపోవడంతో పాటు, ఉపాధి హామీ పనులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ పరిస్థితుల వల్ల లక్షలాది మంది కూలీలు పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్లాల్సి వస్తోందని, ఈ వలసలలో జరిగిన ప్రమాదాల్లో ఇప్పటికే 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇటీవల కోసిగి మండలానికి చెందిన ఓ వ్యవసాయ కార్మికుడు వడదెబ్బతో మతి చెందిన ఘటనను ప్రస్తావిస్తూ, అతని కుటుంబం అనాధగా మారిందని, అయినా ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదని విమర్శించారు.


