రేపల్లె: బాపట్ల జిల్లా రేపల్లె పట్టణానికి చెందిన మద్దుల ఏసుకుమారి(27) ఆదివారం అంబులెన్ ్సలోనే పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. పూరిటి నొప్పులతో ఆమెను రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా హీమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉండటం, నొప్పులు అధికంగా ఉండటంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో 108లో తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవ వేదనలు పెరిగి అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగింది. అనంతరం వారిని తెనాలి ఆసుపత్రికి చేర్చగా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఈఎంటీ కేసన మహేష్ బాబు తెలిపారు.
దుగ్గిరాల: మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. యువకులు మద్యం సేవించి చిన్నపాటి గొడవ చిలికి చిలికి గాలివానలా మారి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు...ఆదివారం కంఠంరాజుకొండూరు గ్రామంలోని అమ్మవారి దేవస్థానం దగ్గర ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. తాడేపల్లికి చెందిన పేరుపోగు వంశీని తలపై ఇనుపు రాడ్డుతో తెనాలికి చెందిన వ్యక్తులు కొట్టగా తల పగిలింది. మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ వైద్యశాలకు తరలించారు. మద్యం షాపు పక్కనే ఉండటం వల్ల ఆలయానికి దర్శనం కోసం వచ్చిన వారు బాగా మద్యం సేవించి గొడలు పడుతున్నారని పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు.
దుగ్గిరాల: కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీటి విడుదలను ఆదివారం నుంచి నిలిపివేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రబీ సాగు చేసిన మొక్కజొన్న, జొన్న, మినుము, నువ్వులు, పెసర పంటలు కోతలు పూర్తయ్యాయని తెలిపారు.
మైలవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మైలవరం మండలం పుల్లూరులోని చిలుకూరువారిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రెడ్డిగూడెం మండలం రుద్రవరం తండాకు చెందిన దేవావతు రవి(30) ద్విచక్రవాహనంపై మైలవరం బయలుదేరాడు. ఈ క్రమంలో పుల్లూరు సెంటర్ సమీపంలో ఉన్న చిలుకూరువారిగూడెం జెడ్పీ హైస్కూల్ వద్దకు వచ్చే సమయానికి మైలవరం నుంచి తిరువూరు వైపు వెళ్తున్న టిప్పర్ ఢీకొని రవి రహదారిపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన రవిని స్థానికులు 108 వాహనంలో మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గొల్లపూడిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు. సంఘనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


