పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా కలెక్టర్ కృతికా శుక్లా బాధ్యతల స్వీకారం
చిలకలూరిపేట: పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా తాగునీటి సరఫరా, వీధి దీపాలు, రోడ్లు, డ్రైన్ల నిర్వహణ, అమృత్ స్కీమ్ పనుల తీరు, పన్నుల వసూళ్లు, షాపుల అద్దెల వసూళ్లు, భవన నిర్మాణ అనుమతులు, బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, టిడ్కో ఇళ్ల నిర్మాణం, గృహ నిర్మాణపథకాలు, జనన గణన, జనన మరణాల రికార్డుల పరిశీలనతో పాటు సంబంధిత అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మున్సిపల్ సేవలు మరింత మెరుగ్గా అందించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు, మున్సిపల్ డీఈఈ షేక్ అబ్దుల్ రహీం, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ
క్రోసూరు: ఏపి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పాలిటెక్నిక్‌లలో ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్–2026 ప్రవేశపరీక్షకు క్రోసూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళశాలలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కళశాల ప్రిన్స్‌పాల్ బి.వీ.రమాదేవి శనివారం తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న జరుగుతుందని, అందుకుగాను ఏప్రిల్ 4 వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు ఎంట్రన్స్ రాసే విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందచేయబడుతుందన్నారు. పాలిసెట్ ఎంట్రన్స్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 4 వ తేదీగా తెలిపారు. దరఖాస్తు చేసుకొనే వారు అధికారిక వెబ్‌సైట్ http://polycetap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. వివరాలకు 94903 43929, 96189 26798,72072 88540 లో సంప్రదించవచ్చునన్నారు.
వరికోత మిషన్ తగిలి మహిళ మృతి
మాచవరం: వరి కోత మిషన్ తగిలి మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని వేమవరం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పెరుగు నాగేంద్ర (60) తెల్లవారు జామున ఇంటి పనులు చేసుకునేందుకు ఇంటి ముందుకు రాగా, మాచవరం వైపు నుంచి తెలంగాణ వైపు వెళుతున్న వరి కోత మిషన్ ముందు భాగం నాగేంద్రం తలభాగానికి తగిలింది. ఘటనలో నాగేంద్ర తలకు తీవ్ర గాయం కాగా అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు . మృతురాలి కుమారుడు జానయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వివాహిత ఆత్మహత్య
యడ్లపాడు: చీరతో ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన యడ్లపాడులో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మృతురాలు షేక్ జిమ్మాబి(28)కి సుమారు ఎనిమిదేళ్ల కిందట ఫిరంగిపురానికి చెందిన షేక్ ఖాజావలితో వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో నాలుగేళ్ల కిందట కుమారుడిని భర్త వద్ద వదిలివేసి పెదకాకానిలోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరింది. ఈ నేపథ్యంలో ఆమె ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు గమనించిన తల్లిదండ్రులు ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. మనస్తాపానికి గురైన జిమ్మాబి యడ్లపాడు వచ్చి ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటుంది. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరెతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
నాగార్జునకొండను
సందర్శించిన శ్రీలంక మంత్రి
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను శనివారం శ్రీలంక దేశానికి బుద్ధ సేన రిలీజియస్, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హిణిడుమ సునీల్ సేన్వి 21 దేశాలకు చెందిన బౌద్ధ భిక్షువులు విదేశీ ప్రతినిధులతో కలిసి సందర్శించారు. వీరు లాంచీలో నాగార్జునకొండకు చేరుకొని కొండలోని మ్యూజియంలో ఉన్న తొమ్మిది అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని పుట్టుకకు సంబంధించిన శిలా ఫలకాలు, రాతి పనిముట్లు, సింహళ విహార్, మహా స్థూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం తిలకించి బౌద్ధ గురు దలైలామా నాటిన బోధి వృక్షం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వీరికి నాగార్జునకొండ మ్యూజియం క్యూరేటర్ కమల్‌హాసన్ నాగార్జునకొండ చరిత్రను వివరించారు.


