నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం విద్యాశాఖలో చేపడుతున్న రేషనలైజేషన్ ప్రక్రియను రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల రద్దే లక్ష్యంగా ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపడుతున్నదని పేర్కొన్నారు. ఎస్‌టీయూ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. రామిరెడ్డి మాట్లాడుతూ, పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టడంతో ఇప్పటికే ప్రతి మండలంలో పదుల సంఖ్యలో ఏకోపాధ్యాయ పాఠశాలలు దర్శనమిస్తున్నాయని తెలిపారు. గత ఏడాది రేషనలైజేషన్ కారణంగా వందల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు రద్దయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది కూడా గడవకుముందే మళ్లీ రేషనలైజేషన్‌కు ప్రభుత్వం సిద్ధపడటంతో పాఠశాలల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని స్పష్టం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.ఏమండీ మాట్లాడుతూ, రేషనలైజేషన్ కారణంగా ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారి విద్యా బోధనకు తీవ్ర ఆటంకంగా మారుతున్నదని తెలిపారు. ఉపాధ్యాయులలో అభద్రతా భావం ఏర్పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారిని కలిసి సమస్యలపై వినతి పత్రం అందచేశారు. దీర్ఘకాలిక వ్యాధులు, చంటి పిల్లలు ఉన్న తల్లులను పదవ తరగతి స్పాట్ నుంచి మినహాయించాలని కోరారు. పది పరీక్షలు పూర్తయిన వెంటనే విధులు నిర్వహించిన వారికి వెంటనే చెల్లింపులు చేపట్టాని, పెండింగ్ బకాయిలను జమ చేయాలని కోరారు. ఆయా సమస్యలపై డీఈఓ పీవీజే రామారావు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఎస్‌టీయూ నాయకులు షేక్ కరిముల్లా, షేక్.మహబూబ్ సుభానీ, కె.యేసయ్య, పి.వి.భీష్మారావు తదితరులు పాల్గొన్నారు.


