నరసరావుపేట: కలెక్టరేట్‌లో శనివారం జాయింట్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షతన ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్వాంగుల కోసం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 24 అర్జీలు స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖలకు అందజేసి వెంటనే పరిష్కరించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. దివ్వాంగుల వద్దకు జేసీ స్వయంగా వచ్చి అర్జీ స్వీకరించి వారి సమస్య విని డీఆర్‌డీఏ పీడీని పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సాహితీవేత్త నారాయణచార్యులకు ఘన నివాళి
నరసరావుపేట రూరల్: ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిధులు పుట్టపర్తి నారాయణచార్యులు జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు నారాయణ చార్యుల చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి నారాయణచార్యులు విశేష సేవలు అందించారని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ రంగస్థలంపై నాట్య ప్రదర్శనలు ఇచ్చారని తెలిపారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రఖ్యాత నవల ఏకవీరను మళయాళంలోకి అనువదించారని, మరాఠి నుంచి ధర్మానంద కోశాంబి, వినాయక సావర్కర్ వంటి రచయితల రచనలను తెలుగులో అందుబాటులోకి తీసుకువచ్చరాని వివరించారు. దాదాపు 150 గ్రంథాలను వివిధ భాషలలో రాసినట్టు తెలిపారు. సాహిత్యానికి నారాయణచార్యులు చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి సత్కరించినట్టు వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, సీఐ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


