స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు...
సాక్షి, నరసరావుపేట/నరసరావుపేట రూరల్: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం శివనామస్మరణతో మారుమోగింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు ఆదివారం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్‌ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కోటప్పకొండ పుణ్యక్షేత్రం భక్తజన సందోహంతో నిండిపోయింది.
● తెల్లవారుజామున ఒంటి గంటకు బిందెతీర్థంతో స్వామి వారికి ఆలయ ప్రధానార్చకులు అప్పయ్యగురుకుల్ ఆధ్వర్యంలో అభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
● స్వామి వారి దర్శనం కోసం అర్ధరాత్రి నుంచి భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. ఉచిత దర్శనంతో పాటు రూ.100లు, రూ.200లు, రూ.500ల అభిషేక క్యూల ద్వారా దర్శించుకున్నారు.
● ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన రూ.300 వీఐపీ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన భక్తులకు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామి వారి దర్శనం కల్పించారు. ఉదయం నుంచి భక్తులతో క్యూ కాంప్లెక్స్ కిక్కిరిసింది. ఉచిత దర్శనంలో భక్తుల రద్దీ అధికంగా కనిపించింది.
● మండపంలో నిర్వహించిన అభిషేకాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోఫాన మార్గం నుంచి భక్తులు మెట్ల పూజ నిర్వహించుకుంటూ కొండపైకి చేరుకున్నారు. ధ్యానశివుడు, నాగేంద్రుని పుట్ట, నంది విగ్రహం వద్ద భక్తులు పూజలు నిర్వహించారు.
● త్రిముఖ శివలింగం వద్ద యాత్రికులు సెల్ఫీలు తీసుకోవడం కనిపించింది. పలువురు భక్తులు కాలినడకన పాతకోటయ్య స్వామి ఆలయం వద్దకు చేరుకుని దర్శించుకున్నారు.
● జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. క్యూలైన్లు, ఆలయ పరిసరప్రాంతాలను సందర్శించి భక్తులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఆలయ ఈవో డి. చంద్రశేఖర్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ప్రభల వద్ద కోలాహలం...
ప్రభల పండగగా పేరొందిన కోటప్పకొండ తిరునాళ్లలో భారీ విద్యుత్ ప్రభలు యాత్రికులను కనువిందు చేశాయి. ఈ ఏడాది అధికంగా 23 భారీ విద్యుత్ ప్రభలు కొండకు తరలివచ్చాయి. భారీ విద్యుత్ ప్రభల కాంతులతో కోటప్పకొండ ప్రాంతం ప్రత్యేక రూపు సంతరించుకుంది. ప్రభలపై ఏర్పాటుచేసిన సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రభల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా స్పెషల్ పార్టీ పోలీసులు విధులు నిర్వహించారు. కొండ కింద పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన దుకాణాల వద్ద రోజంతా సందడి నెలకొంది.
కోటప్ప కొండకు తరలివచ్చిన భక్త జన సందోహంలో ఓ భాగం
స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు...
స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు...
స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు...


